విజయవాడలోనే ఆర్టీసీ కేంద్ర కార్యాలయం


విద్యాధరపురం స్థలానికి  కమిటీ ఆమోదం

ఇక్కడే వంద పడకల ఆస్పత్రి,  గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం


 

 విజయవాడ : రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై నియమించిన నిపుణుల కమిటీ కూడా విజయవాడే సరైన ప్రాంతమని నిర్ణయించింది. దీంతో ఇక్కడ అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించేందుకు ఒక కమిటీ శనివారం నుంచి మూడు రోజులపాటు పర్యటించి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇక్కడి విద్యాధరపురంలో ఉన్న ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఎండీ కార్యాలయాన్ని, గెస్ట్‌హౌస్‌ను  నిర్మించాలని నిర్ణయించారు. ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లోని తార్నాకలో వంద పడకల ఆస్పత్రి ఉంది. ఇది రాష్ట్ర విభజనలో తెలంగాణకు వెళ్లిపోతుంది. దీంతో ప్రత్యామ్నాయంగా విజయవాడలో వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారు.



విద్యాధరపురం వర్క్‌షాప్ వద్ద ఉన్న డిస్సెన్సరీ స్థానంలోనే ఈ ఆస్పత్రి నిర్మించనున్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న పాత బస్టాండ్ స్థలాన్ని కూడా స్వాధీనంలోకి తీసుకుని భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని లీజుకిచ్చారు. ఈ వివాదం కోర్టులో ఉంది. రవాణా శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చే ట్రాన్స్‌పోర్ట్ అకాడెమీని విజయవాడకు సమీపంలోని గన్నవరంలో ఏర్పాటు చేయనున్నారు. గతంలో గన్నవరంలో ట్రాన్స్‌పోర్టు అకాడెమీ కోసం స్థలాన్ని సేకరించారు. అయితే, అది హైదరాబాద్‌కు తరలిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ జోనల్ శిక్షణ కళాశాల నడుస్తోంది. రాష్ట్ర విభజనతో మళ్లీ ఇక్కడే అకాడెమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్టీసీలోని సివిల్ ఇంజినీరింగ్ అధికారులు ఎండీ కార్యాలయం, గెస్ట్‌హౌస్, ట్రాన్స్‌పోర్టు అకాడెమీ, వంద పడకల ఆస్పత్రికి డిజైన్లను తయారుచేసి ఆమోదం కోసం పంపించినట్లు తెలిసింది. వీటికి ఆమోదముద్ర పడితే జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.



 13,300 బస్సులు, 69 వేల మంది ఉద్యోగులు సీమాంధ్రకు



 ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా 217 డిపోలున్నాయి. 22,222 బస్సులతో లక్షా ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. విభజన పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు 69,600 మంది ఉద్యోగులు వస్తారు. ఈ ప్రాంతానికి 13,300 బస్సులను కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 707 మంది అధికారులు ఉండగా, 413 మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించనున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top