ఆర్టీసీకి తొలి శోభ

కర్నూలు బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులతో పర్యటిస్తూ - Sakshi


- మొదటి మహిళా చైర్‌పర్సన్‌గా పని చేసిన శోభానాగిరెడ్డి

- సంస్థ నష్టాల నివారణకు శ్రీకారం చుట్టిన కర్నూలు బిడ్డ

- డిపోలను సందర్శించి లాభార్జన మార్గాలపై అన్వేషణ

- కార్మిక సంక్షే మానికి కృషి  చేసిన నారీమణి

- ఆమె అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆర్టీసీ ఉద్యోగులు


 

 

 కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణ సంస్థ.. ప్రయాణికుల సేవలో గిన్నిస్ రికార్డు సాధించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు తొలి మహిళా చైర్మన్‌గా పని చేసిన భూమా శోభ నాగిరెడ్డి అకాల మరణాన్ని సంస్థ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.



1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన శోభా నాగిరెడ్డి 2002 నవంబరు 7వ తేదీన ఆర్టీసీ రథ సారథిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 16 నెలల పాటు చైర్‌పర్సన్‌గా పని చేసిన ఆమె సాధారణ ఎన్నికల నేపథ్యంలో 2004 ఏప్రిల్‌లో ముందస్తుగా పదవికి రాజీనామా సమర్పించారు. పదవీ కాలంలో సంస్థ నష్టాల నివారణపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.



కర్నూలు జిల్లాకు చెందిన వారు కావడంతో జిల్లాలోని అన్ని డిపోల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. సంస్థను లాభాల పట్టించడం కోసం తానొక మహిళను అని కూడా చూడకుండా రాష్ట్రవ్యాప్తంగా నష్టాల్లో నడుస్తున్న డిపోలను గుర్తించి వాటిని ప్రత్యక్షంగా సందర్శించారు.



అందుకు కారణాలు తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టారు. ప్రమాదాలు, వాటి నివారణ, రూట్లు, ప్రయాణికుల అవసరాలు, సౌకర్యాల కల్పన, ఇంధన పొదుపు వంటి అంశాలపై దృష్టి సారించి భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉన్నతాధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.



ఆర్టీసీకి కార్మికులే వెన్నెముకలాంటి వారని గుర్తించిన ఆమె కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. డిపోల సందర్శన సమయాల్లో కార్మికులతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలు తెలుసుకొనేవారని, సంక్షేమానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేవారని ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top