జూన్ 3న ఆర్టీసీ విభజన

జూన్ 3న ఆర్టీసీ విభజన


కొత్త ముహూర్తం ఖరారు చేసిన ఎండీ

28న విభజన వాయిదాపై నిరసనల నేపథ్యంలో కొత్త తేదీ ప్రకటన


 

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ విభజనకు కొత్త ముహూర్తం ఖరారైంది. జూన్ 3 నుంచి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు విడివిడిగా పనిచేయ బోతున్నాయి. ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలాభిడే కమిటీ పర్యవేక్షిస్తుండగా పని విభజనకు వీలుగా ఆర్టీసీ అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా స్థానికత ఆధారంగా ఎక్కడి వాళ్లు అక్కడే పద్ధతిలో అధికారులు, సిబ్బంది కేటాయింపు ఇప్పటికే పూర్తయింది. ఈనెల 28 నుంచి రెండు ఆర్టీసీలు విడివిడిగా పని ప్రారంభిస్తాయని గతంలోనే ఎండీ సాంబశివరావు ముహూర్తం ఖరారు చేశారు. కానీ అనూహ్యంగా దాన్ని వాయిదా వేస్తూ మూడు రోజుల క్రితం ఆయన మెమో జారీ చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆంధ్ర ప్రాంత అధికారులు ఆప్షన్‌ల పేరుతో తెలంగాణలో కొనసాగేందుకు వీలుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

 

 ఈ నేపథ్యంలో భౌగోళికం గా ఆంధ్ర ప్రాంతానికి చెంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు ఈడీగా వ్యవహరిస్తున్న జయరావు నుంచి ఆ బాధ్యతను తొలగిస్తూ తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణరావు ఆదేశాలు జారీ చేశారు. వెరసి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో ఆర్టీసీ ఎండీ కొత్త ముహూర్తాన్ని ఖరారు చేశారు. జూన్ మూడు నుంచి రెండు రవాణ సంస్థలు విడివిడిగా పనిచేస్తాయని వెల్లడిం చారు. జూన్ ఒకటి నాటికి రెండు రాష్ట్రాలకు కేటాయించే అధికారుల జాబితాను తేల్చాల్సి ఉంటుంది. కాగా, విభజన జరిగితే బస్‌భవన్‌లోని ఏ బ్లాక్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ, బీ బ్లాక్ కేంద్రంగా తెలంగాణ ఆర్టీసీ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి.

 

 నేడు షీలాభిడే కమిటీతో ఎండీ, జేఎండీ భేటీ

 ఆర్టీసీ విభజనకు సంబంధించి తీసుకున్న చర్య లు, ప్రస్తుత పరిస్థితిపై షీలాభిడే కమిటీ ఆర్టీసీ ఎండీని ప్రశ్నించింది. కమిటీ సభ్యులకు శుక్రవారం ఆ వివరాలు అందజేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణరావులు శుక్రవారం కమిటీతో భేటీ కానున్నారు. ఆర్టీసీ ఆస్తులు, అప్పులపై నిర్ణయించేందుకు జరగాల్సిన ఆర్టీసీ బోర్డు సమావేశం ఇప్పటికి నాలుగుసార్లు వాయిదాపడిన విషయాన్ని అధికారులు కమిటీకి వివరించనున్నారు.  బోర్డు సమావేశం ఏర్పాటు చేసి దానిపై తుది నిర్ణయం తీసుకుని నివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశించే అవకాశం ఉంది.

 

 ఆగస్టు వరకు కమిటీ గడువు పొడిగింపు?

 షీలాభిడే కమిటీ గడువు ఈనెల 31తో ముగియనున్నా ఆర్టీసీ విభజన కొలిక్కి రాని నేపథ్యంలో కమిటీ గడువును పొడిగిస్తూ రేపో, మాపో ఉత్తర్వు వెలువడనుంది. కనీసం మూ డు నెలల గడువు అవసరమని కమిటీ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఆగస్టు వరకు గడువు పెంచే అవకాశం ఉందని సమాచారం.

 

 తాజా మెమోలోనూ మెలిక ?

 జూన్ 3న విభజన ముహూర్తం ఖరారు చేస్తూ గురువారం జారీ చేసిన మెమోలో పేర్కొన్న ఒక వాక్యంపై తెలంగాణ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో స్టేట్ క్యాడర్ పోస్టుల విభజన ఉంటుంది’ అని తాజా మెమోలో ఎండీ పేర్కొనడం, బస్ భవన్ కేంద్రంగా రెండు ఆర్టీసీల విభజన ఉంటుందనే మరో వాక్యానికి ఇది అనుసంధానంగా ఉండటంతో ఆ విభజన బస్ భవన్‌కే పరిమితం అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top