మాస్టారే


 సాక్షి ప్రతినిధి, కాకినాడ :మాస్టార్లు ‘మాస్టారి’ ప్రాతినిధ్యాన్నే కోరుకున్నారు. ఆరెస్సార్ (రాము సూర్యారావు)నే ‘స్టార్’గా నిలిపారు. చివరి వరకు ఉత్కంఠ రేకెత్తించిన ఉభయగోదావరి జిల్లాల  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్, పీడీఎఫ్‌లు బలపరిచిన రాము సూర్యారావు విజయం సాధించారు. ఆయనకు సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి చైతన్యరాజు కంటే 1,526 ఓట్ల ఆధిక్యం లభించింది. రెండున్నర నెలలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి నుంచి త్రిముఖ పోరే నడిచింది. ఒకపక్క అధికార టీడీపీ అభ్యర్థి చైతన్యరాజు, మరోపక్క పార్టీ రెబల్‌గా ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావుల మధ్య రాము సూర్యారావు గెలుపొందడం విశేషంగా నిలిచింది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు ఓటర్లైన ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా చేసిన ప్రయత్నాలు ఫలితాలపై ప్రభావాన్ని చూపించలేకపోయాయి. గతం నుంచి ఉపాధ్యాయ వర్గంపై ఉన్న ప్రలోభాల అపవాదును ఈ ఎన్నికలతో పోగొట్టుకున్నారని, ఈ క్రమంలో సామాన్యుడైన రిటైర్డ్ లెక్చరర్  సూర్యారావుకు పట్టం కట్టారని విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యారావు దాదాపు పాతికేళ్లుగా ఆ జిల్లాలో పేద విద్యార్థులకు, ప్రభుత్వాస్పత్రిలో పేదల కోసం తన యావదాస్తిని ధారపోశారనే పేరు ఈ ఎన్నికల్లో విజయానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.

 

 తొలి నుంచీ సూర్యారావు, చైతన్యరాజుల నడుమే పోటీ

 చైతన్యరాజు, కృష్ణారావు ప్రచారంలో తమదైన శైలిని ప్రదర్శించగా, సూర్యారావు ఆర్భాటానికి దూరంగా, చాపకింద నీరులా  ఉపాధ్యాయుల్లోకి వెళ్లడంతో విజయం సాధించారని మేధావి వర్గం విశ్లేషిస్తోంది. ఎన్నికల బరిలో 15 మంది నిలిచినా  పోలింగ్ ముందు వరకు పోటీ ప్రధానంగా టీడీపీ అభ్యర్థి, మండలిలో పార్టీ విప్ చైతన్యరాజు, యూటీఎఫ్ బలపరిచిన రాము సూర్యారావు, టీడీపీ రెబల్ పరుచూరి కృష్ణారావుల మధ్యనే జరిగింది. కానీ ఓట్ల లెక్కింపు వచ్చేసరికి సూర్యారావు, చైతన్యరాజు మధ్యే పోటీ కనిపించింది. టీడీపీ రెబల్ కృష్ణారావుతో పాటు ఆ పార్టీపై వివిధ వర్గాల్లో నెలకొన్న వ్యతిరేకత ఎన్నికల్లో చైతన్యరాజు ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ గెలిచి తీరాలని గట్టిగా పార్టీ శ్రేణులకు నొక్కి చెపుతూ, నేతలకు పదేపదే సమావేశాలు నిర్వహించినా ఫలితాన్ని రాబట్టలేకపోయారు. ఇందుకు పార్టీలో కొందరు నేతలు వెన్నుపోట్లు కూడా కారణమయ్యాయని పార్టీలో చర్చ జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి చైతన్యరాజు, కృష్ణారావు ఇద్దరు పోటీపడ్డా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యారావునే విజయం వరించింది.

 

 చివర్లో ఉత్కంఠ..

 మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి సూర్యారావు మొదటి స్థానం, చైతన్యరాజు ద్వితీయ స్థానం, కృష్ణారావు తృతీయ స్థానంలో నిలిచారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాలలో బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రి 10 గంటల వరకు జరిగింది. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి రాము సూర్యారావు 7,679 ఓట్ల ఆధిక్యతతో ముందుండగా, టీడీపీ అభ్యర్థి చైతన్యరాజు 5,699 ఓట్లతో రెండో స్థానంలో, పరుచూరి కృష్ణారావు 3,344 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి ఎవరికీ నిర్దేశించిన కోటా ఓట్లు 8,496 రాకపోవడంతో  రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు చేపట్టారు. 15 మంది అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీలో పరిగణనలోకి తీసుకోకుండా (ఎలిమినేషన్) చేస్తూ 11 రౌండ్‌లు పూర్తయిన అనంతరం 12 వ రౌండ్‌లో పరుచూరి కృష్ణారావు ఓ ట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియలో తొలుత చైతన్యరాజుకు, సూర్యారావుకు పోటాపోటీగా ఓట్లు రావడంతో తొలి ప్రాధాన్య ఓట్ల మెజార్టీ తారుమారవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. అరుుతే సూర్యారావుకు మొదటి ప్రాధాన్య ఓట్లలో రెండువేల ఓట్ల మె జార్టీ ఉండటంతో గెలుపు సునాయూసమైంది. ప్ర క్రియ పూర్తి అయ్యేసరికి సూర్యారావుకు 8,899, చైతన్యరాజుకు 7,373 ఓట్లు వచ్చాయి. ఎలిమినేషన్ వి ధానంలో చివరకు సూర్యారావుకు కోటా ఓట్లు కంటే 403 ఓట్లు అధికంగా దక్కడంతో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకటించారు.

 

 నూతన ఒరవడికి శ్రీకారం చుడతా..

 ఏ పార్టీకీ, ఏ వ్యక్తికీ నేను వ్యతిరేకిని కాను. ఇది ఉపాధ్యాయులు, అధ్యాపకుల విజయం. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయంతో విద్యా విధానంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడతా. క్లష్టర్ విధానంపై పోరాడతా. విద్యారంగ పటిష్టతకు కృషి చేస్తా.

 - రాము సూర్యారావు

 

 ఓటమికి రెబలే కారణం

 రెబల్ వల్లే ఓడిపోయా. నా గెలుపు కోసం అందరూ శాయశక్తులా కృషి చేశారు. నాకు ఓటేసిన అందరికీ నా ధ న్యవాదాలు. శాసనమండలి సభ్యునిగా ఈ ఆరేళ్ల కాలంలో ఉపాధ్యాయ సమస్యలపై నా శాయశక్తులా ఎంతో కృషి చేశా.

 - చైతన్యరాజు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top