‘తాత్కాలిక’ దుబారా రూ. 150 కోట్లు

‘తాత్కాలిక’ దుబారా రూ. 150 కోట్లు - Sakshi


అంచనాలు రూపొందించిన పెట్టుబడుల శాఖ

కోట్లాది రూపాయలు వృథా అవుతాయని ఆర్థిక శాఖ అభ్యంతరం

సీఎం చెంతకు చేరిన ఫైలు




సాక్షి, హైదరాబాద్: ఒకవైపు రెవెన్యూ లోటుతో ఇబ్బందులకు గురవుతున్న రాష్ట్రాన్నిదుబారా వ్యయం ఆర్థికంగా మరింత కుంగదీస్తోంది. తాత్కాలిక రాజధాని కోసం రూ. 150 కోట్ల అంచనాలతో మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ అంచనాలు రూపొందించింది.  ఒకవైపురాజధాని నిర్మాణానికి, రైతుల రుణ మాఫీకి, ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి నిధుల్లేవంటూనే మరోవైపు వృథా వ్యయానికి సిద్ధపడడంపై ఐఏఎస్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు ఆఫీసుల హంగులకు రూ. 23 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి దుబారాకు మొగ్గు చూపుతుండటాన్ని వారు విమర్శిస్తున్నారు.



ఒక చదరపు అడుగుకు రూ. 2,200 వ్యయం అంచనాతో ఐదు లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక రాజధాని నిర్మాణానికి టెండర్ పిలిచిన విషయం తెలిసిందే. దీనికి 110 కోట్ల రూపాయల మేర వ్యయమవనుంది. ఇతర ఖర్చులకు మరో రూ. 40 కోట్ల మేర వ్యయం అవుతుందంటూ అంచనాలను రూపొందించారు. తాత్కాలిక రాజధానిలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ. 2,200 వ్యయమవుతుందని అంచనా వేశారు. అయితే శాశ్వత రాజధాని నిర్మాణం చేపడితే అప్పుడు తాత్కాలిక రాజధాని నిర్మాణాలు ఎందుకు పనికిరాకుండా పోతాయని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.



శాశ్వత రాజధాని నిర్మాణానికి చదరపు అడుగుకు రూ. 2,600 రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాశ్వత రాజధాని నిర్మాణానికి, తాత్కాలిక రాజధాని నిర్మాణానికి వ్యయంలో కొద్ది  శాతమే వ్యత్యాసం ఉన్నందున నిధులను దుర్వినియోగం చేసినట్లవుతుందని అభిప్రాయపడింది. తాత్కాలిక రాజధాని నిర్మాణం అంచనాలతో కూడిన ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ముఖ్యమంత్రి  తీసుకునే నిర్ణయంపైనే తాత్కాలిక రాజధాని నిర్మాణం ఆధారపడి ఉంది.



ఇదిలా ఉండగా వచ్యే విద్యా సంవత్సరం నాటికి పలు శాఖల విభాగాలను గుంటూరు-విజయవాడలకు తరలించే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏయే శాఖలను తరలించాలి, అక్కడ వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనే దానిపై అంచనాకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను కూడా రూపొందించింది.



తాత్కాలిక రాజధాని పేరిట నిర్మాణాలు అవసరం లేదని, గుంటూరు, విజయవాడల్లో ఉన్న అనేక ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేట్ కళాశాలలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వినియోగించుకుంటే సరిపోతుందంటూ అధికారుల కమిటీ నివేదికను రూపొందించింది. అయినప్పటికీ  ప్రభుత్వ పెద్దలు తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరిట కోట్లాది రూపాయలను నిధులు దుర్వినియోగం చేయడానికి మొగ్గు చూపుతుండటంతో అధికారులు బాహాటంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసేందుకు ఇష్టపడడం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top