దక్కని ఫలితం

దక్కని ఫలితం


► జల సంరక్షణ కోసం రూ. వందల కోట్లు  ఖర్చు

► పెరగని భూగర్భ జలాలు

► సంరక్షణ పనులు సక్రమంగా జరగకే...

► నిధులన్నీ నేతల జేబుల్లోకి వెళ్తున్న వైనం




ఇంకుడు గుంతలు... నీటిని ఇంకింపజేసి భూగర్భజలాలను పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమం. ఇందుకోసం జిల్లాలో కోట్లాదిరూపాయలు ఖర్చు. నీరు చెట్టు... చెరువుల్లో పూడిక తొలగించి పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసి... క్రమపద్ధతిలో సాగునీటిని అందించడానికి రూపొందించిన కార్యక్రమం. ఇందుకోసం జిల్లాలో ఎన్నో కోట్ల ఖర్చు. ఇలా ప్రతీదానికి ఖర్చు కనిపిస్తోంది. కానీ తగిన ఫలితం మాత్రం కనిపించడంలేదు. కారణం చేసే పనుల్లో చిత్తశుద్ధి లేకపోవడం. కేటాయించిన నిధులు కొందరి జేబుల్లోకి చేరడం.



దీనివల్ల ఎంతో ఉదాత్తాశయంతో సర్కారు నిధులు కేటాయిస్తున్నట్టు కనిపిస్తున్నా... అవి పరోక్షంగా తమ పార్టీ నాయకులు దక్కించుకుని... తద్వారా ఆ డబ్బు తమవారికే లభించేలా పథకం ప్రకారం జరుగుతున్న ఓ స్కెచ్‌. అందుకే అధికారులు తేల్చే తప్పులకు సర్కారు నుంచి ఎలాంటి చర్యలూ కానరావడంలేదు.




సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా సగటు వర్షపాతం 990 మిల్లీమీటర్లు. అయినప్పటికీ వేసవి వచ్చిందంటే నీటి కష్టాలే. ఎక్కడ చూసినా భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయి. జల సంరక్షణకు ప్రభుత్వం ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా... అవన్నీ వృధాగానే మారుతున్నాయి.  తూతూ మంత్రంగా పనులు చేపట్టి కోట్లు వెనకేసుకోవడమే దీనికి కారణం. ఫలితంగా భూగర్బ జలాలు పెరగడం లేదు. జిల్లాలో నీటి వనరులకు కొదవ లేదు. కావల్సిన నీటిని ఒడిసి పట్టుకుని దాచుకోవల్సిన అవసరం ఉంది. 



కానీ సమస్య ఇక్కడే వచ్చి పడుతోంది. వర్షాల సమయంలో చినుకులుగా రాలి పడుతున్న నీటిని నిలువరించడంలో విఫలయత్నమే జరుగుతోంది. దీనికోసం అనేక జల సంరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. గడచిన మూడేళ్ల కాలంలో జల సంరక్షణ కార్యక్రమాల కింద సుమారు రూ. 500కోట్లు వరకు ఖర్చు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. చెక్‌డ్యామ్‌లు, నీరు చెట్టు పనులు, పంట సంజీ వని కుంటలు, ఇంకుడు గుంతలు, బిందు, తుంపర సేద్యం, చెరువుల పునరుద్ధరణ, పూడికతీతలు... తదితర అనేక కార్యక్రమాల కింద పనులు చేపడుతున్నారు. కానీ, భూగర్బ జలాలు పెరిగిన దాఖలాలు కన్పించడం లేదు.



గత మూడేళ్లగా పరిశీలిస్తే  

జిల్లాలో ప్రస్తుతం భూగర్బ జలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోం ది. 2015 మే నెలలో సరాసరి 6.46మీటర్ల లోతులో నీరు లభ్యం కాగా, 2016 మే వచ్చే సరికి 6.51మీటర్ల లోతుకు చేరాయి. 2017మే నెలకొచ్చేసరికి 7.21మీటర్ల లోతులోకి వెళ్లాయి. 2015తో పోల్చి చూస్తే 0.75  మీటర్లు లోతుకు భూగర్బజలాలు వెళ్లిపోయాయి. ఇక, మండలాల వారీగా చూస్తే బాడంగిలో 4మీటర్ల కంటే ఎక్కువ లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. పార్వతీపురంలో మూడు మీటర్ల కంటే ఎక్కువకు పడిపోయాయి.



పూసపాటిరేగ, జామి, గంట్యాడ మండలాల్లో రెండు కంటే ఎక్కువ మీటర్లు భూగర్భజలం తగ్గింది. మరో 10 మండలాల్లో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ లోతుకు పడిపోయాయి. సీతానగరం మక్కువ, కురుపాం, కొమరాడ మండలాల్లో మాత్రమే స్వల్పంగా భూగర్బజలం పైకి వచ్చింది. ఒక మీటరు లోపల భూగర్భజలం పెరగడం విశేషం. మిగతా  మండలాల్లో కూడా మీటరులోపు భూగర్భజలాలు పడిపోయాయి.



ఎక్కడ చూసినా అక్రమాలే

జిల్లాలో చెరువు పునరుద్ధరణ పనులు, పూడిక తీతలు, చెక్‌డ్యామ్‌లు, పంట సంజీవని కుంటలు, కాంటూరు ట్రెంచ్‌లు, భూసార తేమ సంరక్షణ చర్యలు, ఇంకుడు గుంతలు... ఇలా ఏ పనిచేసినా... కాసుల వేటే అందులో కనిపిస్తోంది. పరిస్థితి మెరుగుపర్చేవిషయంలో చిత్తశుద్ధి కానరావడంలేదు. కాంట్రాక్ట్, నామినేటెడ్‌ పద్ధతుల్లో అధికార పార్టీ నేతలకు పనులు అప్పగించడంతో ఇష్టారీతిన వ్యవహరించారు. అవకాశం మేరకు అక్రమాలకు పాల్పడి, దొరికిన కాడికి దోచుకున్నారు.



దీనికి ఉదాహరణగా జిల్లాలోని రా మభద్రపురం, మక్కువ, బలిజిపేట తదితర మం డలాల్లో వెలుగు చూసిన నీరు చెట్టు అక్రమాలనే తీసుకోవచ్చు.ఒక్కరామభద్రపురంలోనే రూ. 5కోట్ల వరకు అవినీతి జరిగింది. దాదాపు అన్ని మండలాల్లో జల సంరక్షణ పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా పనులు చేపట్టే వారు చిత్తశుద్ధితో పనిచేయకుంటే భవిష్యత్తులో నీటిముప్పు తప్పదని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.



ప్రమాద ఘంటికలు

ఈ ఏడాది మే నెలలో పరిస్థితి చూస్తే జిల్లా వ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని చెప్పాలి. సాలూరులో ఏకంగా 16.06మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, మెరకముడిదాం, ఎస్‌.కోటల్లో 10మీటర్లు కంటే ఎక్కువ లోతుకు వెళ్లిపోయాయి.



చీపురుపల్లిలో 9మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉండగా బాడంగి, బలిజిపేట, దత్తిరాజేరు, గరివిడి, గరుగుబిల్లి, కొమరాడ, పాచిపెంట, ఎల్‌.కోట, మక్కువ, రామభద్రపురం, తెర్లాం మండలాల్లో ఆరు మీటర్లు నుంచి 9 మీటర్ల మధ్య లోతులో భూగర్భజలం ఉంది. గజపతినగరం, మెంటాడ, పార్వతీపురం, వేపాడ మండలాల్లో 4 నుంచి 6మీటర్ల లోతులో ఉన్నాయి. మిగతా మండలాల్లో 4మీటర్ల లోపు ఉండడం వల్ల అక్కడ పరిస్థితి కొంత ఫర్వాలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top