తమ్ముళ్ల భూబాగోతం!


  • రూ. 7 కోట్లు ప్రభుత్వ భూమి ఆక్రమణ

  • తమ్ముళ్ల ఆధీనంలో భూమి

  • 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నానంటున్న రైతు

  • వెంకటాచలం: జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రూ.7 కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. టీడీపీకి చెందిన ఓ కుటుంబం ఆ భూమిని ఆక్రమించుకుని సాగుచేసుకుం టోంది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ భూమిలోకి ఎవరైనా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం టీడీపీ నేత ఆధీనంలో ఉన్న ఆభూమిని తాము 30 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నామని, అందుకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అయితే వాటిని చూపించటానికి నిరాకరిస్తున్నారు. రెవెన్యూ అధికారుల కథనం మేరకు..



    నెల్లూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకటాచలం మండలకేంద్రంలో క్యూబా ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా.. సీఎ కళాశాలకు ఆనుకుని సర్వే నంబర్ 680-5లో 3.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో ముళ్లచెట్లు ఉండేవి. కొంతకాలం క్రితం టీడీపీకి చెందిన ఓ కుటుంబం ఆక్రమించుకుని చెట్లు తొలగించి దుక్కి దున్నటం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానిక రెవెన్యూ అధికారులు గత వారం పనులు నిలిపివేశారు. ప్రస్తుతం ఎకరం భూమి రూ.2 కోట్లకు పైనే ఉంటుంది. ఈ లెక్కన ఆక్రమించుకున్న ఆ భూమి విలువ రూ.7 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.

     

    టూరిజం శాఖకు కేటాయింపు



    అయితే ఈ భూమిని 2004లో ప్రభుత్వం టూరిజం శాఖకు కేటాయించింది. అందులో భాగంగా గతంలో ఆ భూమిలో రెవెన్యూ అధికారులు హెచ్చరికల బోర్డులు పెట్టారు. 3.16 ఎకరాల భూమిలో టూరిజం శాఖ వారు పలు భవనాలను నిర్మించదలచారు. అయితే సాగు చేసుకుంటున్న వారు ఈ భూమి తమేదనంటూ రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వం టూరిజం శాఖకు ప్రత్యామ్నాయంగా గొలగమూడి వద్ద ప్రభుత్వ భూమిని కేటాయించింది.



    ప్రస్తుతం ఆ భూమిలో టూరిజం శాఖ వారు పనులు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. విలువైన ఈ భూమిని అమ్ముకుని సొమ్ముచేసుకునేందుకు టీడీపీకి చెందిన కొందరు పథకం పన్నినట్లు సమాచారం. ఆ భూమిని విక్రయించి ప్రస్తుతం సాగు చేసుకుంటున్న రైతుకు కొంత సొమ్ము ముట్టజెప్పి.. మిగిలిన సొమ్మును జేబులో వేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

     

    అది ప్రభుత్వ భూమి

    జాతీయ రహదారి పక్కనే ఉన్న 3.16 ఎకరాలు ప్రభుత్వ భూమి. ఈభూమిని టూరిజం శాఖకు కేటాయించాం. అయితే స్థానికులు అందులో వ్యవసాయం చేసుకుంటున్నామంటూ అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యతలో భాగంగా వీఆర్‌ఓను పంపి వ్యవసాయ పనులు ఆపి వేయించాము. ఆ భూమిలో ఎవరైనా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.

     - డీవీ సుధాకర్, తహశీల్దార్, వెంకటాచలం.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top