రూ.60, రూ.10 స్మారక నాణేల విడుదల

ముంబై టంకశాల విడుదల చేసిన రూ.10, రూ.60 నాణేలు


పీచు అభివృద్ధి సంస్థ వజ్రోత్సవాల వేళ విడుదల చేసిన టంకశాల

సేకరించిన అమలాపురంవాసులు


 అమలాపురం: పీచు అభివృద్ధి సంస్థ (కాయర్ బోర్డు) ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయి వజ్రోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ముంబైలోని టంకశాల రూ.10, రూ.60 స్మారక నాణేలను విడుదల చేసింది. వీటిని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన నాణేల సేకర్తలు పుత్సా కృష్ణకామేశ్వర్, ఎస్‌బీఐ ఉద్యోగి ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం సేకరించారు. ఈ నాణేలకు ఒకవైపు కొబ్బరిపీచు, చిప్ప ముద్రించారు.

 

  రూ.10 నాణెం మధ్యభాగాన్ని రాగి, నికెల్‌తోను, చుట్టూ అల్యూమినియం, ఇత్తడితో తయారు చేశారు. 35 గ్రాముల బరువున్న రూ.60 నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, చెరో ఐదు శాతం నికెల్, జింక్ ఉపయోగించి తయారు చేశారు. 1859లో ఇద్దరు అమెరికన్ జాతీయులు మన దేశంలోనే తొలిసారిగా కేరళలోని అలెప్పీలో కొబ్బరిపీచు పరిశ్రమ స్థాపించారు. తరువాత ఎంతోమంది యూరోపియన్లు అలెప్పీలో పీచు పరిశ్రమలు ఏర్పాటు చేసి, వేలమందికి ఉపాధి కల్పించారు. దేశ స్వాతంత్య్రానంతరం వారంతా తమ దేశాలకు తరలిపోగా, కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి 1953లో పీచు అభివృద్ధి సంస్థను నెలకొల్పాయి. దీని ఆధ్వర్యంలో దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించిన కొబ్బరిపీచు పరిశ్రమ సుమారు ఏడులక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోంది. గత ఆరు దశాబ్దాల్లో సంస్థ చేసిన సేవలకు గుర్తింపుగా ముంబైలోని టంకశాల ఈ స్మారక నాణేలు విడుదల చేసినట్టు పుత్సా కామేశ్వర్ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top