రూ.526 కోట్లతో కాఫీ ప్రాజెక్టు

రూ.526 కోట్లతో కాఫీ ప్రాజెక్టు


2025 నాటికి  పూర్తి చేసేలా ప్రణాళిక

ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్


 

విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో తలపెట్టిన కాఫీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు మరో అడుగు పడింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పాడేరు ఐటీడీఎ పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో రూ. 526 కోట్ల 16 లక్షలతో ఈ ప్రాజెక్టు తలపెట్టారు. 2015-16 నుంచి 2024-25ల మధ్య ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహాయం చేయనుండగా, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నుంచి ట్రైబల్ సబ్‌ప్లాన్ కాంపొనెంట్ కింద రాష్ర్టం తన వాటాను సమకూర్చనుంది. ఏజెన్సీ పరిధిలోని కాఫీ ప్లాంటేషన్‌పై ఆధారపడే ప్రతీ గిరిజన కుటుంబానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి కనీసం రూ.లక్ష ఆదాయం సమకూర్చేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కాఫీని గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేయనుంది. అలా సేకరించిన కాఫీని వేలం పాటల ద్వారా విక్రయించనుంది. దీంట్లో కనీసం 50 శాతం మొత్తాన్ని కాఫీ గ్రోయిర్స్‌కు అందజేయనుంది. ఇందుకోసం డెరైక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రతిపాదనల మేరకు ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కార్‌ను ఆదేశించింది.



ట్రైబల్ వెల్ఫేర్ డెరైక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీకి పాడేరు ఐటీడీఎ పీవో మెంబర్   కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ట్రైకార్ మేనేజింగ్ డెరైక్టర్, కాఫీ బోర్డు నుంచి అగ్రిఎకనామిస్ట్, జీసీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌లు సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ సీజన్‌కు కనీసం రెండుసార్లు సమావేశమవుతూ కాఫీ పిక్కల సేకరణ, ధరలను నిర్ణయిస్తుంది.  కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఎపెక్స్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ విద్యాసాగర్ గురువారం రాత్రి ఉత్తర్వులు  ఉత్తర్వులు జారీ చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top