జిల్లాలో సాగునీటి కోసం రూ.400 కోట్లు

జిల్లాలో సాగునీటి కోసం రూ.400 కోట్లు - Sakshi


నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా


జలదంకి : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.400 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మండలంలో చిన్నక్రాక వద్ద కావలి కాలువ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర మంత్రి నారాయణ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఉదయగిరి, వెంకటగిరి ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకటరామారావు, కురుగొండ్ల రామకృష్ణతో కలిసి భూమి పూజ చేశారు.



ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటి రంగానికి ఎంత నిధులైనా కేటాయించేందుకు సిద్ధమన్నారు. కావలి కాలువను 49 కిలో మీటర్ల మేర ఆధునికీకరణను రూ.24 కోట్లతో నిర్వహిస్తున్నామన్నారు. గోదావరి జలాలను కృష్ణకు అక్కడ నుంచి సోమశిలకు మళ్లించి సాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలు ఉండగా 70 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని తెలిపారు.



భవిష్యత్‌లో ఒక్క ఎకరా ఎండకుండా నీటిని అందించే ఏర్పాట్లను చేస్తామన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కావలి కాలువ ఆధునికీకరణ పనులు ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కాలువ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, రైతులు సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.



పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 11,000 క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల పెంచారన్నారు. చివరి పొలాలకు వరకు నీరు అందేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కావలి, ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రాంతాలు కావలి కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్నాయన్నారు. ఆయకట్టు రైతులు పడుతున్న కష్టాలను పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానన్నారు.



కావలి కాలువ సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం తాను చేసిన దీక్షకు రైతులందరూ మద్దతుగా నిలిచారన్నారు. కావలి కాలువ ఆధునికీకరణకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు. అయితే ప్రస్తుతం 550 నుంచి 950 క్యూసెక్కులకు పెరిగే విధంగా కాలువ నిర్మాణం చేస్తున్నారని, దీనిని 1200 క్యూసెక్కుల పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులను కాపాడాలన్నారు. సంగం బ్యారేజి వద్ద ఇసుక బస్తాల సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, కావలి నియోజకవర్గంలో డీఎం చానల్, డీఆర్ చానల్‌ను పూర్తి చేయాలన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాట్లాడుతూ కావలి కాలువ ఆధునికీకరణ పనులకోసం తాను ఎంతగానో కష్టపడ్డానన్నారు.



రెండుసార్లు భూమి పూజ

 భూమి పూజ కార్యక్రమాన్ని రెండు సార్లు నిర్వహించారు. రాహుకాలం వస్తున్నా రాష్ట్ర మంత్రులు రాకపోవడంతో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి, వెంకటగిరి ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ ముందుగా భూమి పూజ చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రులు వచ్చిన తర్వాత మళ్లీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో  కలెక్టర్‌ను కార్యక్రమం చివర్లో మాత్రమే ఆహ్వానించారు. నీరు చెట్టు కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, బీజేపీ నాయకులు కందుకూరి సత్యనారాయణ, జలదంకి మండల నేత వంటేరు జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top