రూ. 30 కోట్ల అదనపు భారం

రూ. 30 కోట్ల అదనపు భారం - Sakshi


♦ తాత్కాలిక సచివాలయం టెండర్లు 12 శాతం అదనంగా ఖరారు  

♦ నిబంధనల ప్రకారం ఐదు శాతం కన్నా ఎక్కువ ఆమోదించరాదు

♦ నిర్మాణ సంస్థల ప్రయోజనాలకే పెద్దపీట.. స్వయంగా జోక్యం చేసుకున్న సీఎం!

♦ మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రకటన..  

 

 సాక్షి, విజయవాడ బ్యూరో: అనుకున్నదే అయ్యింది. నిర్ధారించిన విలువ కంటె ఎక్కువ మొత్తానికే తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. సీఆర్‌డీఏ నిర్దేశించిన వాస్తవ విలువ కంటె 12 శాతం (చదరపు అడుగు రూ.3,350) ఎక్కువ మొత్తానికి టెండర్లను ఖరారు చేసింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 30 కోట్లకు పైగా భారం పడనుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత టెండర్ల ఖరారు విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మూడు ప్యాకేజీల కింద నిర్మించాల్సిన ఆరు భవనాల నిర్మాణానికి రూ. 170.74 కోట్లు ఖర్చవుతుందని టెండరు ప్రకటనలో సీఆర్‌డీఏ పేర్కొంది.



కానీ 12 శాతం ఎక్సెస్‌కు టెండర్లను ఆమోదించడంతో అంచనా వ్యయం రూ. 201 కోట్లకు పెరిగింది. దీంతోపాటు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసే పేరుతో రెండు శాతం ఇన్సెంటివ్‌ను కూడా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం ఇవ్వజూపింది. అలాగే నిర్మాణ సంస్థలు భరించాల్సిన పన్నులను సైతం తగ్గించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. తద్వారా నిర్మాణ సంస్థలకు భారీగా మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తేటతెల్లమవుతోంది. సీఎం జోక్యంతోనే సీఆర్‌డీఏ అన్నింటికీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం ఖర్చులో సగాన్ని హడ్కో నుంచి రుణంగా సేకరించి మిగిలిదాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించారు.



 ఎక్సెస్‌కే సీఎం మొగ్గు..

 రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఒక్కో ప్యాకేజీకి రెండు భవనాలు చొప్పున మొత్తం ఆరు భవనాలను (బ్లాకులు) మూడు ప్యాకేజీలుగా విభజించింది. చదరపు అడుగు విలువను మూడు వేలుగా నిర్ధారించారు. మూడు ప్యాకేజీలకు ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేయగా వారం క్రితం వాటిని తెరిచారు. రెండు ప్యాకేజీల్లో ఎల్ అండ్ టీ, ఒక ప్యాకేజీలో షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు ఎల్1గా నిలిచాయి. అయితే రెండు సంస్థలూ నిర్దేశించిన విలువ కంటె ఎక్కువగా రూ. 4,300 నుంచి రూ.4,500 (35 శాతం) వరకూ టెండర్లలో కోట్ చేయడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. నిబంధనల ప్రకారం నిర్దేశించిన విలువ కంటె ఐదు శాతానికి మించిన దాఖలు చేసిన టెండర్లను ఆమోదించే అవకాశం లేదు. దీంతో సీఆర్‌డీఏ అధికారులు మళ్లీ టెండర్లు పిలవాలని భావించినా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ కంపెనీలకే టెండర్లు ఖరారు చేయాలని స్పష్టమైన ఆదేశాలందాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఎక్సెస్‌కైనా వారికే టెండర్లు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆదివారం దీనిపై ఆయన మరింత స్పష్టత ఇవ్వడంతో అధికారులు చర్చలు జరిపి రూ.3,350కి కంపెనీలను ఒప్పించారు.

 

 ఇన్సెంటివ్‌తోనూ లబ్ధి..

 టెండర్‌లో ఆరు నెలల్లో భవనాలను నిర్మించాలని నిర్దేశించారు. ఐదు నెలల్లోపు పూర్తి చేస్తే ఒక శాతం, నాలుగు నెలల్లోపు పూర్తి చేస్తే రెండు శాతం ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు. రెండు సంస్థలూ జూన్ 15లోపు (నాలుగు నెలల్లోనే) నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. అంటే అదనంగా రెండు శాతం వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీంతోపాటు నిర్మాణ సంస్థ భరించాల్సిన పన్నులను కూడా తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. వాటితో కలుపుకుంటే ఆ సంస్థలు కోరిన విధంగా చదరపు అడుగు రూ.3,500కే పనులు అప్పగించినట్లవుతుంది. ఈ టెండర్లు ఖరారు కాకపోవడం వల్లే ఈ నెల 12వ తేదీన జరగాల్సిన తాత్కాలిక సచివాలయం శంకుస్థాపనను వాయిదా వేశారు. ఇప్పుడు టెండర్లు తంతు కొలిక్కి రావడంతో సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో శంకుస్థాపన తేదీపై నిర్ణయం తీసుకోనున్నారు. 17వ తేదీలోపు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. అయితే ఐదు శాతం కన్నా ఎక్కువకు టెండర్లను ఆమోదించండంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top