కుక్కకు కు.ని. ... ఖర్చు ఎంతో తెలుసా?

కుక్కకు కు.ని. ... ఖర్చు ఎంతో తెలుసా? - Sakshi


తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని శునకాలకు  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తాం.. ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడలో ఓ కార్యక్రమంలో చేసిన ప్రకటన ఇది. ప్రతి పట్టణం, గ్రామంలో వీధి కుక్కల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శునకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులున్నాయి.


కుక్కలు కరవడం వల్ల ర్యాబిస్ సోకడంతో పాటు నెలల పాటు పథ్యం చేయాల్సి రావడం, ఏఆర్‌వీ మందుల కొరత నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించడమే పరిష్కార మార్గమని తెలిపారు. అయితే వీధి కుక్కలకు కు.ని. చేయించడం అంత ఈజీ కాదని, ఖర్చుతో కూడుకున్న విషయమని, ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఈ ఆపరేషన్లు చేయడంలో పేరున్న డాక్టర్ శ్రీధర్ తెలుపుతున్నారు.

 

ఒక్కో శునకానికి కు.ని ఖర్చు రూ.1,200

ఒక్కో కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలంటే రూ. 1,200 ఖర్చవుతుందని చెప్పారు. ఆపరేషన్ చేసిన కుక్కను ఐదు రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధతో చూడాలి. కుట్లు విడిపోకుండా గమనిస్తూ ఉండాలి. ఇలాంటి పర్యవేక్షణ ఉంటే కాని కుక్కకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స ఫలించదు. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసినప్పుడు స్త్రీల మాదిరి కాకుండా అండాశయం, గర్భాశయం పూర్తిగా తొలగిస్తారు.


పునరుత్పత్తి అండాశయాల క్యాన్సర్‌ను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ద్వారా తగ్గించవచ్చు. ఆడ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం మేలని శ్రీధర్ తెలిపారు. విదేశాల్లో ఈ పద్ధతి అమలులో ఉన్నట్టు చెప్పారు. ఆడ కుక్కలను గుర్తించి, ప్రత్యేక వలల ద్వారా పట్టుకుని శస్త్రచికిత్స చేసిన తర్వాత కుట్లు ఆరే వరకు ప్రత్యేక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా అవి మగ కుక్కలతో కలిసినా సంతానోత్పత్తి జరగకపోవడంతో పాటు వాటికి పిచ్చి పట్టదు. దీనివల్ల వీధి కుక్కల సంఖ్యనుతగ్గించవచ్చని డాక్టర్ శ్రీధర్ సూచిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top