అస్తవ్యస్తంగా రేషన్ పంపిణీ!

అస్తవ్యస్తంగా  రేషన్ పంపిణీ!


జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. కందిపప్పు కూడా పంపిణీ చేయడం లేదు. దీంతో జిల్లాలోని సుమారు 11లక్షల మంది తెల్లకార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పామాయిల్ ఇవ్వాలని పేదలు కోరుతున్నారు.

 

విజయవాడ : ఆధార్ సీడింగ్.. పథకాల మార్పు పేరుతో పౌరసరఫరాల విభాగం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని చౌకధరల దుకాణాల్లో పేదలకు సరుకులు సక్రమంగా అందడం లేదు. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. బియ్యం, పంచదార, కిరోసిన్ మాత్రమే ఇస్తున్నారు. అక్కడక్కడా గోధుములు కూడా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2,148 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా షాపుల ద్వారా 11,27,903 తెల్ల కార్డుదారులకు సరుకులు సరఫరా చేయాల్సి ఉంది. ఒక్కో కార్డుకు కిలో పామాయిల్ అందించాల్సి ఉంది. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిపివేయడంతో పేదలు మార్కెట్‌లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు సరుకుల పంపిణీకి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సంక్రాంతికి కూడా తమకు పచ్చడిమెతుకులేనని పేదలు వాపోతున్నారు.



‘అమ్మహస్తం’కు బ్రేక్



గత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మహస్తం పథకం పేరుతో తొమ్మిది రకాల సరుకులను 199 రూపాయలకు అందజేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసింది. దాని స్థానంలో ఎన్టీఆర్ పేరుతో ‘అన్నహస్తం’ అనే కొత్త పథకాన్ని జనవరి నుంచి ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. కానీ, దీనిపై నేటి వరకు అధికారులకు ఉత్తర్వులు అందలేదు.



సంక్రాంతికి గిఫ్ట్ ప్యాక్ అందేనా!



పేదల నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం ‘గిఫ్ట్ ప్యాక్’కు రూపకల్పన చేసినట్లు తెలిసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో చౌకధరల దుకాణాల ద్వారా ఎన్టీఆర్ పేరుతో ఈ గిఫ్ట్ ప్యాక్‌లను అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్యాక్‌లో తక్కువ ధరకు బెల్లం, కందిపప్పు, సన్‌ఫ్లవర్ ఆయిల్ అందిస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే రేషన్ షాపు ద్వారా పాత పద్ధతిలోనే అన్ని సరుకులు పంపిణీ చేయాలని పేదలు కోరుతున్నారు.  

 

పేదల ఇబ్బందులు వర్ణణాతీతం



ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలేదు. టీడీపీ ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం లేదు. పామాయిల్ ఇవ్వడంలేదు. ఇతరసరుకులు కూడా అరొకరగా ఇస్తున్నారు. మార్కెట్‌లో సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. కొనుగోలు చేయలేక పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   

     

- సీహెచ్ బాబూరావు, సీపీఎం నగర కార్యదర్శి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top