రౌడీషీటర్ దారుణ హత్య


 ఏలూరు(వన్ టౌన్)/(ఫైర్ స్టేషన్ సెంటర్): ఏలూరులో మంగళవారం అర్ధరాత్రి ఒక రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మరో రౌడీషీటర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హతులు నగరంలో పేరుమోసిన రౌడీషీటర్లు. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ, మస్తాన్‌మన్యం కాలనీకి చెందిన బండి రామనాథం(37), వన్‌టౌన్ పడమరవీధిలోని కొబ్బరితోటకు చెందిన కర్రి ఈశ్వరరావు(26) అక్కడికక్కడే మృతి చెందారు. రామనాథం గతంలో పాత దుస్తుల వ్యాపారం చేసేవాడు. 1998లో అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని కుటుంబ సభ్యులు చూస్తుండగానే రామనాథం, అతని అనుచరులు కలిసి కత్తులతో దారుణంగా హత్య చేశారు.

 

 2000లో బందర్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో కూడా నిందితుడు. అతనిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 30 కేసుల వరకు ఉన్నాయి. వాటిలో 7 హత్య కేసులు. 2006లో మారణాయుధాలు కలిగి ఉన్న కేసు కూడా ఉంది. కొంత కాలం క్రితం రామనాథంను నగర బహిష్కరణ చేశారు. అప్పటి నుంచి తిరుపతిలో స్థిరపడ్డాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ప్రతి ఏడాది ఏలూరులో జరిగే జాతరకు వచ్చి వెళుతుంటాడు. అదే విధంగా ఈ నెల 19న కుటుంబ సభ్యులతో కలిసి ఏలూరు వచ్చాడు. అయితే మంగళవారం రాత్రి రామనాథం, అతని అనుచరుడు సీహెచ్ శ్రీను కలిసిగజ్జెలవారి చెరువు వద్ద ఉన్న బార్‌లో మద్యం సేవించడానికి వెళ్లారు.

 

 అదే సమయంలో బార్‌లో మద్యం సేవిస్తున్న స్థానిక సత్యనారాయణపేటకు చెందిన పట్నాల మోహన్, బేత రత్నకుమార్, టి.కిరణ్‌లతో రామనాథం గొడవ పెట్టుకున్నాడు. గొడవ సర్దుమనగడంతో ఎవరి దారిన వారు వెళ్లి పోయారు. రాత్రి 12 గంటల సమయంలో రామనాథం, శ్రీను వారి స్నేహితుడు బ్రహ్మం కలిసి మోటార్ సైకిల్‌పై సత్యనారాయణపేటకు వెళ్లారు. అక్కడే ఉన్న మోహన్, రత్నకుమార్ మరికొందరితో గొడవకు దిగారు. దీంతో ఆగ్రహించిన వారు పక్కనే ఉన్న రాడ్డులతో రామనాథంపై దాడి చే సి హత్య చేశారు. శ్రీను, బ్రహ్మం అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు, డీఎస్పీలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సాయంత్రం మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు.

 

 అనుమానాస్పద మృతి.. హత్యే అంటున్న బంధువులు

 స్థానిక కొబ్బరితోటకు చెందిన కర్రి ఈశ్వరరావు అలియాస్ ఖాన్‌కు 5 నెలల క్రితం వివాహమైంది. భార్యతో కలిసి విశాఖపట్నం వెళ్లిపోయాడు. అతని తల్లికి అనారోగ్యంగా ఉండటంతో 20 రోజుల క్రితం ఏలూరు వచ్చాడు. మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఉన్న సమయంలో గన్‌బజార్ సెంటర్‌కు చెందిన గౌస్ కొబ్బరితోట ప్రాంతానికి వచ్చి ఒక ఇంట్లో ఓ మహిళతో ఉండగా ఈశ్వరరావు, మరికొందరు గుర్తించారు. గౌస్‌ను పట్టుకుని, చెట్టుకు కట్టేసి కొట్టి అక్కడి పెద్దలకు అప్పగించారు. పెద్దలు గౌస్‌కు రూ.5 వేల జరిమానా విధించారు. గౌస్ వద్ద సొమ్ము లేకపోవడంతో ఇంటికి వెళ్లి తెస్తానని చెప్పగా అతనితో పాటు ఈశ్వరరావు కూడా వెళ్లాడు. అప్పటికే పాతబస్టాండ్ వద్ద గౌస్ స్నేహితులు ఉన్నారు. స్నేహితుల వద్ద ఈశ్వరరావును పెట్టి గౌస్ మోటారు సైకిల్ వేసుకుని డబ్బులకు వెళ్లాడు. స్నేహితుల వద్ద ఉన్న ఈశ్వరరావు వారి మోటారు సైకిల్ తీసుకుని ఫ్లైఓవర్‌పైకి వెళ్లాడు.

 

 అక్కడ ఏమైందో ఏమో గానీ.. ఫ్లైఓవర్‌పై తీవ్ర గాయాలతో ఈశ్వరరావు మృతి చెంది ఉన్నాడు. అతని వద్ద ఉన్న మోటారు సైకిల్‌ను తీసుకుని నేరుగా పెద్దల వద్దకు వెళ్లిన గౌస్ సొమ్ములు ఇచ్చి వస్తుండగా ఈశ్వరరావు ఏడని అడగగా, పాతబస్టాండ్ వద్ద ప్రమాదానికి గురై మృతి చెందాడని చెప్పి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి మృతదేహం వద్దకు చేరుకున్నారు. ఈశ్వరరావును గౌస్ అతని స్నేహితులు కలిసి హత్య చేసి, యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. రాత్రి వీరు ఉన్న పాతబస్టాండ్ సెంటర్లో గొడవ జరిగిందని, అక్కడ ఉన్న స్థానికుల ద్వారా తెలిసిందని, ఈశ్వరరావును హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని వారు కోరారు. ఇదిలాఉంటే ఈశ్వరరావు, రామనాథంలు స్నేహితులు. వీరిద్దరూ ఒకే రోజు హత్యలకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top