రూట్‌మ్యాప్ నేడు ఖరారు


చురుగ్గా అమరావతి శంకుస్థాపన పనులు

 120 అడుగుల భారీ సభావేదిక నిర్మాణం

భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ జె.వి.రాముడు

 నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షాసమావేశం




విజయవాడ : అమరావతి శంకుస్థాపన పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంగళవారం డీజీపీ జె.వి.రాముడు సభా ప్రాంగణాన్ని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఉదయం నుంచి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సభా ప్రాంగణంలో ఉండి వేదిక ఏర్పాట్లు, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం సాయంత్రం డీజీపీ జేవీ రాముడు, ముఖ్యమంత్రి వ్యక్తిగత సిద్ధాంతి రాఘవయ్య మాస్టారు సభా ప్రాంగణాన్ని, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌లు సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు, వీఐపీ గ్యాలరీ, ప్రధాని రాకకోసం హెలిప్యాడ్ ఏర్పాట్లు, సభా వేదిక నిర్మాణ పనులు, పార్కింగ్ వివరాలను డీజీపీకి వివరించారు.



అనంతరం గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలతో డీజీపీ అక్కడ ప్రత్యేకంగా మాట్లాడి సభావేదికకు చేరుకోవడానికి ఉన్న మార్గాలు, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పనుల్లో మరింత వేగం పెరిగేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో చర్చించాక బుధవారం బందోబస్తు, రూట్‌మ్యాప్‌ను అధికారులు ఖరారు చేయనున్నారు.

 అయితే ప్రాథమికంగా 17 వేల మంది పోలీసులను బందోబస్తు విధులు కేటాయించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే కార్యక్రమం కావటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనితో పాటు ఢిల్లీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రధాని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.



భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక గ్యాలరీ...

రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరించి 13 వేల మంది రైతులు భూములు ఇచ్చారని, వారిని గౌరవించాల్సిన బాధ్యత ఉందని, వారిని శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చూడాలని  సీఎం కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రత్యేకంగా వారందరిని ముందు వరుసలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక గ్యాలరీ నిర్మిస్తే మరింత బాగుంటుందని తెలిపారు.



120 అడుగుల సభా వేదిక

మరో వైపు సభా వేదిక నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. 80 అడగుల వెడల్పు, 40 అడుగుల పొడవుతో భారీ సభా వేదికను నిర్మించనున్నారు. వేదికపై ప్రధాని కాకుండా మరో 14 మంది మాత్రమే ఉండాలని ఇప్పటికే ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో సభా వేదికను రెయిన్‌ప్రూఫ్ టెంట్లతో ప్రత్యేక అలంకరణతో నిర్మిస్తున్నారు. వీఐపీలకు విందు ఏర్పాటు చేయనున్నారు. సభకు హాజరయ్యే లక్ష మందికి ఆహారం ప్యాకెట్లు అందజేయాలని నిర్ణయించి, ఆ బాధ్యతను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు.



 నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉద్దండరాయుని పాలెంలో పర్యటించనున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించనున్నారు. అనంతరం విజయవాడలో సీఆర్‌డీఏ కార్యాలయంలో అధికారులతో సభా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top