‘సవాల్‌ విసిరిన లోకేష్‌కు ఇప్పుడేమైంది?’

‘ఒకే దర్యాప్తుతో చంద్రబాబు జీవితాంతం జైలులో..’ - Sakshi


విజయవాడ‌: సిట్‌ అనేది కోరులు లేని పాములాంటిదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్యే రోజా అన్నారు. విశాఖ భూముల కబ్జాపై కచ్చితంగా సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. భూకబ్జాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హస్తం ఉందని చెప్పారు. లక్ష ఎకరాల భూకబ్జా దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని అన్నారు. ప్రతిపక్షాలు, మంత్రలు, మీడియా, మిత్రపక్షమైనా బీజేపీ కోరుతున్నా బాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.



భూములు కబ్జా చేసిన మంత్రి గంటా కూడా సీబీఐ విచారణ కోరుతున్నారని అయినా చంద్రబాబు,లోకేశ్‌ భూదందాలు బయటపడతాయనే వారు జరిపించడం లేదని అన్నారు. తెలంగాణలో భూకబ్జాలపై సీబీఐ విచారణ కోరుతున్న టీడీపీ ఇక్కడ ఎందుకు అలా కోరడం లేదని ప్రశ్నించారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుదుద్‌ తుఫాను సమయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు రాత్రిపూట తిరిగింది రికార్డులు తారుమారు చేయడానికని ఇప్పుడర్ధమవుతోందని చెప్పారు. మహానాడులో సవాల్‌ విసిరిన లోకేశ్‌ ఇప్పుడెందుకు సీబీఐ విచారణపై నోరు మెదపడం లేదని నిలదీశారు. టీడీపీ నేతలను తప్పించేందుకే ప్రస్తుతం సిట్‌ విచారణ చేయిస్తున్నారని, దానితో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.



వేల ఎకరాలు భూములు కబ్జా అయ్యాయని స్వయంగా టీడీపీ నేత, ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పడం, అది నిజమే అని కలెక్టర్‌ సైతం చెప్పినా లెక్కచేయకుండా సీబీఐ దర్యాప్తు వేయకుండా సిట్‌తో సరిపుచ్చడం చంద్రబాబు తప్పించుకోవాలని చూడటమే తప్ప మరొకటి కాదని దుయ్యబట్టారు.  వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఆరోపణలు వస్తే వాటిపై వెంటనే సీబీఐ విచారణ వేసేవారని, అలాంటి దమ్ము మాత్రం చంద్రబాబుకు లేకుండా పోయిందని, ఒకసారి దర్యాప్తు వేస్తే జీవితాంతం జైలులో ఉండాల్సి వస్తుందనే విషయం చంద్రబాబు, లోకేశ్‌కు ముందే తెలుసని అందుకే వారు అలా చేయడం లేదని విమర్శించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా చంద్రబాబు, లోకేశ్‌ విశాఖ భూములను కబ్జా చేస్తున్నారని రోజా ధ్వజమెత్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top