రుణమాఫీపై చంద్రబాబుది కప్పదాటు ధోరణి

రుణమాఫీపై చంద్రబాబుది కప్పదాటు ధోరణి - Sakshi


తిరుపతి : రుణమాఫీపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కప్పదాటు ధోరణి ప్రదర్శిస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా విమర్శిం చారు. నగరిలో ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో గాయపడి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  వైఎస్సార్ సీపీ కార్యకర్త గణేష్‌ను పరామర్శించేందుకు ఆమె మంగళవారం తిరుపతికి వచ్చారు.



ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు రాష్ట్రంలో వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలు ఏమేర ఉన్నాయో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. రుణ బకాయిలు ఏ మేర ఉన్నాయో తనకు ముఖ్యమంత్రి అయ్యాకే తెలిసిందని చెప్పడం ప్రజలను వంచించడమేనని పేర్కొన్నారు.

 

కమిటీల పేరుతో కాలయాపన చేసి, రుణమాఫీలో షరతులు పెట్టి చంద్రబాబు ప్రజలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. అన్ని రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు మాట మార్చి పరిమితులు విధించడం కుటిల రాజనీతికి నిదర్శనమని విమర్శించారు.

 

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై చంద్రబాబు భౌతిక దాడులను ప్రోత్సహిస్తున్నారని, స్థానిక సంస్థలను కైవసం చేసుకోవడానికి టీడీపీ లెక్కలేనన్ని అరాచకాలకు పాల్పడిందని అన్నారు. చివరకు న్యాయం, ధర్మం గెలుస్తాయన్న వాస్తవం జమ్మలమడుగు, నెల్లూరు మున్సిపల్, జెడ్పీ చైర్మన్‌ల ఎన్నికల్లో తేటతెల్లమైందని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top