మృత్యు శకటం

మృత్యు శకటం - Sakshi


ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేటు అంబులెన్స్

తండ్రి, ఇద్దరు కుమారుల దుర్మరణం

అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్రగాయాలు


 

 డ్రైవర్ నిద్రమత్తు మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. అనారోగ్యంతో ఉన్న కొడుకును ప్రైవేటు అంబులెన్స్‌లో హైదరాబాద్ నుంచి ఒంగోలుకు తీసుకొస్తుండగా.. మార్గమధ్యంలో ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో తండ్రితో సహా ఇద్దరు కుమారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండలంలోని కొంగపాడు డొంక వద్ద మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

 

 అద్దంకి,పొన్నలూరు మండలం పెద వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కసుకుర్తి మాలకొండయ్య, రెండో కుమారుడు మధు హైదరాబాద్‌లో మోటారుబైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. మధు కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ క్రమంలో మధు తండ్రి మాలకొండయ్య, అన్న మాల్యాద్రిలు అతనికి హైదరాబాద్‌లోని రెమిడి వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. అయితే అక్కడ వైద్య ఖర్చులు భరించలేక.. ఒంగోలులో   వైద్యం చేయించేందుకు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రైవేటు అంబులెన్స్‌లో మధుని తీసుకొని ఒంగోలు బయలుదేరారు. అంబులెన్స్ వాహనం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అద్దంకి సమీపంలోని కొంగపాడు డొంక వద్దకు చేరుకోగానే డ్రైవర్ నల్గొండ జిల్లా పంపల్లికి చెందిన జే వెంకటేశ్వర్లు నిద్రలోకి జారుకున్నాడు.



అదే సమయంలో హైదరాబాద్ వెళ్తూ  రోడ్డు మార్జిన్‌లో నిలిపి ఉన్న లోడ్ లారీని అంబులెన్స్ అదుపు తప్పి ఢీకొంది. ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న మధు తండ్రి మాలకొండయ్య (65), అన్న మాల్యాద్రి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన మధును, అంబులెన్స్ డ్రైవర్ వెంకటేశ్వర్లును లారీడ్రైవర్ సురేష్‌గౌడ్ అం దించిన సమాచారం  మేరకు 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మధు (30) మృతిచెందాడు. ఈ ఘటనపై మాలకొండయ్య సోదరుడు కోటయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 శోకసంద్రంలో పెదవెంకన్నపాలెం



 పెదవెంకన్నపాలెం(పొన్నలూరు),న్యూస్‌లైన్: గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతితో పెదవెంకన్నపాలెం శోకసంద్రమైంది. అద్దంకి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కసుకుర్తి మాలకొండయ్య, ఆయన ఇద్దరు కుమారులు చనిపోవడంతో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం ఒంగోలు రిమ్స్ నుంచి మంగళవారం రాత్రి గ్రామానికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మాలకొండయ్యకు భార్య ఉంది. పెద్దకుమారుడు మాల్యాద్రికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడు మధుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.      

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top