పెళ్లింట విషాదం

పెళ్లింట విషాదం - Sakshi


శుభలేఖలు పంచి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం

ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి

శోకసంద్రంలో కుటుంబసభ్యులు




మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడిని మృత్యువు కాటేసింది. రోడ్డు కల్వర్టు రూపంలో ప్రాణాలు తీసింది. పెళ్లింట విషాదాన్ని నింపింది.



గుమ్మలక్ష్మీపురం: బొబ్బిలి మండలం రామన్నదొర వలస గ్రామానికి చెందిన కొర్లాపు రాజుకు ఈ నెల 28న సాలూరు మండలం బోర్లబంద గ్రామానికి చెందిన ఓ యువతితో పెద్దలు పెళ్లి నిర్ణయించారు. అదే ముహూర్తంలో రాజు చెల్లెలు వరలక్ష్మికి మామ వరుస అయ్యే మామిడి చిన్న అనే వ్యక్తితో పెళ్లి నిర్ణయించారు. ఇద్దరి పెళ్లికి ఆహ్వానించేందుకు కురుపాం మండలంలోని మొండెంఖల్లు, జి.శివడ గ్రామాల్లోని బంధువుల ఇళ్లకు చెల్లికి కాబోయే భర్త మామిడి చిన్నాతో కలిసి బైక్‌పై రాజు ఆదివారం బయలుదేరాడు. పెళ్లి శుభలేఖలు అందజేశారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మార్గంమధ్యలోని పి.ఆమిటి జంక్షన్‌కు ముందున్న రోడ్డు మలుపువద్ద ఉన్న కల్వర్టు గొయ్యిలో బండి దిగడంతో ఇద్దరూ కిందపడ్డారు. వెనుక కూర్చున్న రాజు తలకు బలమైన గాయం కావడంతో కుప్పకూలిపోయాడు.



ఆ వాహనం నడుపుతున్న చిన్నాకు కొద్దిపాటి గాయాలయ్యాయి. చిన్నా అందించిన సమాచారం మేరకు స్థానికుల సహాయంతో రాజును కురుపాం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కురుపాం పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని కురుపాం ఎస్‌ఐ బాలాజీరావు, ఎల్విన్‌పేట ఎస్‌ఐ కె.కిరణ్‌ కుమార్‌ నాయుడు సందర్శించారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. కురుపాం ఆసుపత్రిలో శవపంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం రాజు మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.



గ్రామంలో విషాదం...

మరో ఐదు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన రాజు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లి సింహాచలమ్మ, తండ్రి అప్పారావుతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. అందరితో కలివిడిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న యువకుడు మృతితో స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెంచిపోషిస్తాడనుకున్న కుమారుడు మృతితో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరమూ కావడంలేదు. గ్రామస్తులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని కన్నీరు కార్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top