శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ


తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడు.. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా నేటి సాయంత్రం విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన 9 పాళికలలో– శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు తదితర నవ ధాన్యాలతో అంకురార్పణం చేస్తారు.



రేపు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శనివారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.48 నుంచి 6 గంటల్లోపు మీన లగ్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు సర్వం సిద్ధం చేశారు. అనంతపురం రేంజ్‌ డీఐజీ జె.ప్రభాకరరావు, టీటీడీ సీవీఎస్‌వో రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.  



రేపు శ్రీవారికి ఏపీ సీఎం పట్టువస్త్రాల సమర్పణ  

బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు శనివారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7.30 నుంచి 8 గంటల మధ్య పట్టువస్త్రాలను శ్రీవారికి సమర్పించి దర్శనం చేసుకుంటారు.



పెరటాసి శనివారాల్లో దివ్యదర్శనం టోకెన్ల రద్దు

పవిత్ర పెరటాసి మాసంలో శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో రానున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని కాలిబాటలో నడిచివచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ ప్రజా సంబంధాల విభాగం గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 23న మొదటి పెరటాసి శనివారం, 30న రెండోది, అక్టోబర్‌ 7న మూడోది, 17న నాలుగో పెరటాసి శనివారం రోజుల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేశారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ కారణంగా ఈ నెల 27న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్‌ 29న, నూతన సంవత్సరం సందర్భంగా 2018, జనవరి 1న కాలినడక భక్తులకు టోకెన్ల జారీ ఉండదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top