మద్యం మత్తులో.. రయ్‌.. రయ్‌..

మద్యం మత్తులో.. రయ్‌.. రయ్‌.. - Sakshi


►  పెరుగుతున్న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

ఈ ఏడాది జూలై వరకు 13,278 కేసులు నమోదు

►  293 మందికి జైలు శిక్ష  ∙రూ.87లక్షలు జరిమానా


జిల్లాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులో వాహనాల నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజు రోజుకో పెరుగుతోంది. పోలీసులు తనిఖీలు విస్తృతం చేసినా మందుబాబులు తగ్గడం లేదు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసుకున్న ప్రభుత్వం కూడా కఠిన చర్యలకు పూనుకోవడం లేదు. 



అల్లిపురం(విశాఖ దక్షిణ):

ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు మద్యం. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మద్యం వ్యాపారులు లైసెన్స్‌లు తెచ్చుకుంటున్నారు. వారి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. మద్యం ప్రియులు తమ జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక మద్యం గుటకలు వేసేస్తున్నారు. సిటీలో నెలకు సుమారు 3 లక్షల లిక్కరు, 2 లక్షల బీర్లు గటుక్కున గుటకేస్తున్నారు. ఆ మత్తులోనే వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు.



దీంతో ప్రమాదాల నివారణకు పోలీసులు నడుం బిగించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని,బ్రీతింగ్‌ ఎనలైజర్‌తో పరీక్షలు చేస్తున్నారు. దొరికిన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మందు ఎక్కువైతే కోర్టులో హాజరు పరుస్తున్నారు. అక్కడ న్యాయమూర్తులు జైలు, జరిమానా విధిస్తున్నారు. ఇలా ఒకటి, రెండు సార్లు అయితే ఒకే. మూడోసారి దొరికితే లైసెన్స్‌ సస్పెన్షన్‌లో పెడతారు. ఆ తరువాత కూడా దొరికితే పూర్తిగా లైసెన్స్‌ పొందేందుకు అర్హత లేకుండా చేసేస్తారు. అయినా మందుబాబులు తగ్గుతున్నారా అంటే అదీలేదు. ప్రభుత్వానికి రెండు చేతులా ఆదాయాన్ని ఆర్జించిపెడుతున్నారు.



మద్యం తాగి వాహనం నడిపితే..

మద్యం తాగి వాహనం నడిపితే మొదటి సారి అయితే రూ.2వేలు జరిమానా, ఆరు నెలలు వరకు జైలు శిక్ష ఉండేది. రెండోసారి ఆపై ఘటనలకు రూ.3వేలు జరిమానా విధించేవారు. కేంద్రం చేసిన కొత్త చట్టం ప్రకారం తొలిసారి రూ.5వేలు, 50 గంటల సామాజిక సేవ, ఆరు నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు వంటి చర్యలు ఉన్నాయి. రెండోసారి ఆపై ఘటనలకు రూ.10వేలు జరిమానా, ఏడాది పాటు లైసెన్స్‌ సస్పెన్షన్‌. అదే హెవీ మోటారు వాహనాలు అయితే జరిమానా మొదటిసారి రూ.10వేలు, రెండోసారి రూ.20వేలు, ఆరు నెలల నుంచి ఏడాది పాటు లైసెన్స్‌ సస్పెన్షన్‌ కూడా విధించనున్నారు.



ఆల్కహాల్‌ లెక్కింపు ఇలా..

వాహన చోదకులు రక్తంలో ప్రతి 100 మిల్లీలీటర్లకు ఆల్కహాల్‌ శాతం 30 ఎంజీ ఉంటే నేరంగా పరిగణిస్తారు. కానీ కొత్త చట్టం ప్రకారం దీన్ని 20 ఎంజీకి తగ్గించారు. విశాఖనగరం, రూరల్‌ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులను కోర్టులో ప్రవేశపెడితే తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నారు. ఈ విధంగా ఈ ఏడాది జూలై నెలాఖరు వరకు 13,278 కేసులు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా వారిలో 293 మందికి జైలు శిక్ష పడిం ది. 10,985 మంది నుంచి రూ.86,73,800 జరిమానాగా వసూలు చేశారు.



గత మూడేళ్లలో కేసుల వివరాలు

కేసులు                    2015              2016            2017(జూలై వరకు)

బుక్‌ అయినవి            17956          19565           13278

జరిమానా వేసినవి      17625           18674            10985

జైలు శిక్ష పడినవి                0                 44               296

వసూలైన జరిమానా  1,48,77,300   1,48,69,750    86,73,800




డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై కఠిన చర్యలు

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. మద్యం తాగినప్పుడు స్వయంగా వాహనాలు నడపవద్దు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురికావద్దు. ఇతరులను ప్రమాదంలో పడేయవద్దు. రాత్రి 9 గంటల నుంచి ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోను డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు  నిర్వహిస్తున్నాం. దొరికిన వారిని కోర్టులో హాజరుపరుస్తాం. కోర్టు అనుమతి మేరకు జరిమానా, శిక్ష ఖరారవుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.

– కె.మహేంద్రపాత్రుడు, ట్రాఫిక్‌ ఏడీసీపీ, విశాఖపట్నం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top