తిరిగొచ్చిన సంక్రాంతి


రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం

 

సాక్షి ప్రతినిధి, గుంటూరు: బలవంతపు భూ సమీకరణ తగదని హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజధాని ప్రాంత రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. నాలుగు నెలలుగా అధికారులు, టీడీపీ పాలకులు గ్రామాల్లో నెరపిన భూదందాకు గురువారం హైకోర్టు పుల్‌స్టాఫ్ పెట్టడంతో రాజధాని రైతులకు సంక్రాంతి తిరిగి వచ్చినట్టయింది. సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారు.


సంబరాలు చేసుకున్నారు. రాజధాని నిర్మాణం పేరిట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన భూ దందాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాయి. చివరకు హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వం తెగబడటంతో రైతులు కంటిమీద కునుకులేకుండా కాలం గడిపారు.



ఈ పరిస్థితుల్లోనే వ్యవసాయం మినహా మరొకటి తెలియని రైతుల భవిష్యత్ అగమ్యగోచరం కావడంతో వైఎస్సార్ సీపీ వారి పక్షాన నిలిచింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. అంతకు ముందు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) రైతుల పక్షాన పోరాటం ప్రారంభించారు. ఇక్కడి పరిస్థితులను పార్టీకి వివరించడంతో 42 మంది శాసన సభ్యులు, సీనియర్లు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల పక్షాన పోరాటం చేస్తామని వారిలో మనోధైర్యం నింపారు.



రైతుల బాధలు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారుల స్థితిగతులపై అసెంబ్లీలో చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ చేసిన ప్రయత్నాలను ప్రభుత్వం నిలువరించినా, హైకోర్టు ఆదేశంతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది వేడుకలు నిర్వహించిన  అనంతరవరం గ్రామ రైతులు సైతం ఇప్పుడు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేరు.


దాంతో కింకర్తవ్యంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. మూడు పంటలు పండుతున్న జరీబు భూములను వదిలి, మెట్టభూముల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలా? న్యాయపోరాటం చేయాలా? అనే అంశాలపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దాదాపు 30 వేల ఎకరాలను ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సమీకరించింది. ఇందులో సాలీనా మూడు పంటలు పండిస్తున్న జరీబు భూములు 10 వేల ఎకరాల వరకు ఉన్నాయి.

 

ఇదీ నేపథ్యం...


రాజధాని నిర్మాణానికి రైతుల అంగీకారం లేకుండా భూములు సమీకరిస్తున్నారనీ, సారవంతమైన భూములను మినహాయించాలని కోరుతూ నిడమర్రు గ్రామానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాక, ఆది నుంచి భూ సమీ కరణను వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు చేశారు. భూ సేకరణ చట్టంలో మార్పులు తీసుకురావద్దని ఢిల్లీలో దీక్ష చేసిన సామాజిక ఉద్యమ కార్యకర్త అన్నా హజారేను కలిశారు. ఇక్కడి పరిస్థితులను వివరించారు.



ఈ సమయంలోనే సమీకరణకు సహకరించకపోతే భూ సేకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ఇతర మంత్రులు రైతులను తీవ్రస్థాయిలో బెదిరించారు. దీంతో భయపడిన రైతులు అంగీకారపత్రాలు ఇచ్చారు. అనంతరం భయంతోనే భూములు ఇచ్చామంటూ తమ అంగీకారపత్రాలు తిరిగి ఇవ్వాలంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైకోర్టు భూసమీకరణకు ఇష్టం లేని రైతులను మినహాయించాలని, అదేవిధంగా భయంతో అంగీకారపత్రాలు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వాలనీ, దీనిపై 15 రోజులలో నివేదిక అంద జేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

ఫలించిన వైఎస్సార్ సీపీ ఉద్యమం ..


భూ సమీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ఉద్యమం ఫలించింది. ఎమ్మెల్యే ఆర్కే భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం నుంచి చివర వరకు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అనుసరిస్తున్న విధానాలు సక్రమంగా లేవంటూనే 9.2 అభ్యంతర పత్రాలపై రైతులకు అవగాహన కలిగించారు. దీంతో జరీబు గ్రామాల్లోని ఎక్కువ మంది రైతులు అభ్యంతర పత్రాలు ఇచ్చారు. దీని ప్రకారం రైతుల నుంచి భూములు తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. అంగీకారం తెలుపుతూ 9.3 పత్రాలు ఇచ్చిన రైతులు కూడా ఇప్పుడు తిరిగి తమ భూములు తీసుకునే ఆలోచన చేస్తున్నారు.

 

పవన్‌కల్యాణ్‌కు తొలగిన మబ్బులు ....

రాజధాని రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తానని ఇక్కడి పర్యటన సమయంలో ప్రకటించిన సినీ నటుడు పవన్‌కల్యాణ్, ఆ మర్నాడే అందుకు భిన్నంగా హైదరాబాద్‌లో ప్రకటించారు. అంతేకాకుండా రాజధాని రైతుల సమస్యలపై ఆ తరువాత ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో ఆయనపై పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి.

 

ఆర్కే అండతో కోర్టుకు వెళ్లాం...

నిడమర్రు గ్రామంలో ఎకరా పొలం వుంది. భూసమీకరణ గడువు ముగింపు సమయంలో  ప్రభుత్వం లాక్కుంటుందని భయపడి అంగీకారపత్రం ఇచ్చాం. మళ్లీ ఎమ్మెల్యే ఆర్కే ధైర్యం చెప్పడంతో కోర్టుకెళ్లాం. - భీమిరెడ్డి సీతామహాలక్ష్మి, రైతు.

 

ఆర్కే వల్లే మా భూములు నిలిచాయి...

తొలి నుంచి భూసమీకణను వ్యతిరేకించేందుకు కారణం రాజధాని ఇష్టం లేక కాదు. ఏడాదికి మూడు పంటలు పండే మా భూములను మాత్రమే మినహాయించాలని కోరాం. అయినా ప్రభుత్వం మొండితనంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నించడంపై కోర్టుకు వెళ్లాం. ఎమ్మెల్యే ఆర్కే  రైతుల్లో మనోధైర్యం నింపడంతో పాటు పోరాటం చేయడం ద్వారానే ఈ రోజు భూములను నిలబెట్టుకోగలిగాం.

 - తమ్మిన వీరాంజనేయులు, రైతు





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top