మిగిలిందంతా మాదే!

మిగిలిందంతా మాదే! - Sakshi


* శ్రీశైలం, సాగర్ జలాల్లో వాటాపై కృష్ణా బోర్డుకు టీ సర్కారు లేఖ

* ఏపీ ఇప్పటికే తన వాటాను వినియోగించుకుంది

* ఇక పొరుగు రాష్ట్రానికి దక్కే నీరు కేవలం 1.72 టీఎంసీలు

* రిజర్వాయర్లలో మిగిలిన 116.96 టీఎంసీలు తెలంగాణకే..

* ఆ మేరకు రబీ అవసరాలకు వాడుకుంటామని స్పష్టీకరణ

* వాటాలు, వినియోగంపై బోర్డుకు పూర్తి గణాంకాలు




సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో నీటి వినియోగంపై నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. ప్రస్తుత జల సంవత్సరం(వాటర్ ఇయర్)లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఇప్పటికే తన వాటాను దాదాపు పూర్తిగా వినియోగించుకున్నదని, ఇక మిగిలిన జలాలన్నీ తెలంగాణకే దక్కుతాయని వెల్లడించింది.  కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది లభ్యమైన నీటిలో ఏపీ వాటా కింద ఇంకా 1.72 టీఎంసీలు మాత్రమే మిగిలాయని పేర్కొంది. ప్రస్తుత రబీ సీజన్‌లో తమ వాటా మేరకు ప్రాజెక్టుల్లో మిగిలిన జలాలను వినియోగించుకుంటామని పేర్కొంటూ కృష్ణా బోర్డుకు తెలియజేసింది.



ఈ మేరకు కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత, వినియోగం, అవసరాలు, ఇరు రాష్ట్రాల వాటాలను వివరిస్తూ తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) మురళీధర్ సోమవారం లేఖ రాశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం కింద తాగు, సాగు, విద్యుత్ అవసరాల డిమాండ్‌పై ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు చర్చించుకొని ఓ నిర్ణయానికి రావాలని బోర్డు గతంలోనే సూచించిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల ఇది సాధ్యం కాలేదు. ఈ దృష్ట్యా నీటి వాటాలను వివరిస్తూ, తమ వాటా మేరకు నీటిని వాడుకుంటామని బోర్డుకు రాష్ర్ట ప్రభుత్వం లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.



మిగులులో ఏపీ వాటా స్వల్పమే..!

కృష్ణా బేసిన్‌లో ఈసారి లభ్యమైన నీరు, ఇరు రాష్ట్రాలకు ఉన్న కేటాయింపులు, ఇప్పటివరకు వినియోగించుకున్న నీటి వివరాలను లేఖలో రాష్ర్ట ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించింది. అన్ని గణాంకాలను పొందుపరుస్తూ గట్టి వాదన వినిపించింది. ఈ వివరాల ప్రకారం కృష్ణా నదిలో నాగార్జునసాగర్ వరకు మొత్తంగా 616.37 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, అందులో ఇరు రాష్ట్రాలకు కలిపి 549.65 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశముంది. విభజన చట్టం మేరకు తెలంగాణ, ఏపీలు 41.61 శాతం, 58.39 శాతం ప్రకారం ఈ నీటిని వాడుకోవాల్సి ఉంది. దీంతో తెలంగాణకు 228.71 టీఎంసీలు, ఏపీకి 320.94 టీఎంసీలు దక్కుతాయి. అయితే తెలంగాణ ఇప్పటివరకు నిర్ణీత వాటాలో 111.74 టీఎంసీలను వాడుకోగా.. ఏపీ మాత్రం 319.22 టీఎంసీలను వినియోగించుకుంది.



దీంతో ఇక ఏపీకి కేవలం 1.72 టీఎంసీల నీరు మాత్రమే దక్కనుండగా, తెలంగాణకు మరో 116.96 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశముంది. ఈ నీటిని వచ్చే ఏడాది ఆగస్టు వరకు వినియోగించుకోవచ్చు. ఈ గణాంకాలను బట్టి ప్రస్తుతం ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిలో 1.72 టీఎంసీలను మినహాయించి మిగతా నీరంతా తమకే దక్కుదుంతని కృష్ణా బోర్టుకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. సాగర్ ఎడమ కాల్వ కింద ప్రస్తుత రబీలో 5.25 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన దృష్ట్యా తమ వాటా నీటిని వాడుకుంటామని తెలిపింది.



రబీకి 77 టీఎంసీలు..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలో మిగిలిన ఖరీఫ్ అవసరాలకు 12.71 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద రబీ అవసరాలకు 77.90 టీఎంసీలను వాడుకోనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇక వచ్చే ఆగస్టు వరకు తాగునీటి అవసరాలకు 8 టీఎంసీలు, ఏఎంఆర్‌పీకి 6 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 9 టీఎంసీలు, కల్వకుర్తి నీటి అవసరాలకు 1.30 టీఎంసీలను వినియోగించుకోనున్నట్లు వివరించారు.



వాటాల వినియోగం (టీఎంసీల్లో)

రాష్ట్రం    నీటివాటా    వినియోగించుకుంది    మిగిలిన వాటా

తెలంగాణ    228.71(41.61 శాతం)    111.74    116.968

ఆంధ్రప్రదేశ్    320.94 (58.39 శాతం)    319.22    1.722

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top