మహిళలంటే ఇదేనా గౌరవం?


 విజయనగరం కంటోన్మెంట్ : వారంతా మధ్య తరగతి కుటుంబాల మహిళలు. తమ ప్రాంతంలో జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు కావడంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. రోజురోజుకూ ఎక్కువవుతున్న మందుబాబుల ఆగడాలు భరించలేకపోయారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం వల్ల మహిళలతోపాటు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల మంత్రి కిమిడి మృణాళినిని కలసి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ దుకాణాన్ని అక్కడ నుంచి తొలగించాలని వేడుకున్నారు. దీనిపై మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. మద్యం దుకాణాన్ని మరో చోటకు తరలిస్తామని, కొద్ది రోజులు సమయమివ్వండని వారికి నచ్చజెప్పారు. మంత్రి కూడా ఓ మహిళే కదా.. తోటి మహిళల ఆవేదనను అర్థం చేసుకుంటారులే అనుకుని వారంతా ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఇప్పుడా ఆ దుకాణం తొలగించలేదు సరికదా.. ఏకంగా మరింత లోపలికి వచ్చింది. ‘ఇది మీకు న్యాయమా? మీరూ ఒక మహిళే కదా.. మహిళల సమస్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేద’ని నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్‌లోని మహిళలు మంత్రి కిమిడి మృణాళినిని ప్రశ్నిస్తున్నారు.

 

 మరోమారు కలెక్టరేట్‌కు వచ్చిన మహిళలు

 గురువారం నెల్లిమర్లలోని రామతీర్థం జంక్షన్‌కు చెందిన మహిళలంతా మరోమారు కలెక్టరేట్‌కు వచ్చారు. ఎంపీటీసీ పి.మహాలక్ష్మి, రత్నకుమారిలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు ఎక్సైజ్ డీసీని కలిసేందుకు వచ్చారు. స్థానిక విలేకరుల ఎదుట కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబా ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఉసిరికల వైన్స్‌లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని, మద్యం సేవించిన వారి అసభ్య ప్రవర్తనలు, ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాపోయారు. ఈ ప్రాంతంలో గుట్టుగా జీవిస్తున్న మహిళలు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో ఆందోళనలు చేస్తే కాస్త సమయమడిగారని, మరింత సమస్యలు ఎక్కువయ్యే ప్రాంతంలో ఇప్పుడు దుకాణం ఏర్పాటు చేస్తున్నారని వాపోయారు.

 

 టీడీపీకి చెందినవారి దుకాణమనా వివక్ష?

 కాగా, మహిళలంతా ఇప్పటికే రెండు సార్లు గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి వినతిపత్రం అందించారు. ఇప్పటికే ఓ సారి ధర్నా కూడా చేశారు. అయినా ఎటువంటి ఫలితమూ దక్కలేదు. అసలు ఈ దుకాణం కొండవెలగాడకు మంజూరయితే(షాపు నెం:67) ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆ దుకాణం తెలుగు దేశం పార్టీ నాయకులకు చెందినది కావడంతోనే మంత్రి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. షాపు మెయిన్‌రోడ్‌లోని జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టారని, దీని వల్ల ప్రమాదాలు కూడా జరిగే వీలుందని చెబుతున్నారు. మంత్రి, కలెక్టర్‌లకు మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా.. ఈ షాపును వేరే చోటకు తరలించాలని కోరుతున్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top