ప్రత్యేకహోదాపై అసెంబ్లీ తీర్మానం

ప్రత్యేకహోదాపై అసెంబ్లీ తీర్మానం - Sakshi

  •    మిగతా ఎజెండా పక్కనపెట్టి తీర్మానం చేయాలన్న  వైఎస్సార్‌సీపీ

  •    ప్రశ్నోత్తరాలను చేపట్టాలని అధికారపక్షం బెట్టు

  •   పోడియం వద్ద నినాదాలతో హోరెత్తించిన ప్రతిపక్షం

  •  సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ మంగళవారం చేసిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేకహోదా అంశంపై చర్చ అనంతరం సభా నాయకుడు ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ అంశంపై శాసనసభ తీర్మానం చేయాలని రెండు రోజులుగా ప్రతిపక్షం పట్టుబట్టి ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిపాదించారు. అంతకుముందు ఈ అంశంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలను వివరించారు.


    ప్యాకేజీకన్నా ప్రత్యేకహోదా ఏ రకంగా రాష్ట్రానికి మేలు చేస్తుందో తెలిపారు. కేంద్రం హోదా ఇవ్వాలనుకుంటే ఎలాంటి అడ్డంకులు లేవని సోదాహరణగా చెప్పారు. హోదా ఇవ్వడానికున్న మార్గాలను తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఈ అంశంపై మాట్లాడుతూ, రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం కేంద్రం వద్ద తాము చేసిన ప్రయత్నాలను వివరించారు. ఈ చర్చలో అధికార టీడీపీ, మిత్రపక్ష బీజేపీ సభ్యులు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. హోదాతోపాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తీర్మానం ప్రతిపాదించగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

     రెండో రోజూ విపక్ష సభ్యుల నిరసన...

     ప్రత్యేకహోదాపై తీర్మానం చేయాలని సోమవారం శాసనసభ ప్రారంభమైన తొలిరోజున డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ రెండోరోజు మంగళవారం కూడా అదే అంశంపై సభలో పట్టుబట్టింది. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ప్రత్యేకహోదా కోరుతూ అప్పటికే ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు నిరసన తెలియజేశారు. ప్రశ్నోత్తరాలు సహా మొత్తం ఎజెండాను పక్కనపెట్టి హోదాపై చర్చించాలని విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దాన్ని స్పీకర్ అంగీకరించకపోవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం ముందు నిలబడి నిరసన తెలిపారు.


    ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టాల్సిందేనని అధికార పక్షం కోరింది. ఆ తర్వాత మిగతా అంశాలను తీసుకుందామని స్పీకర్ చెప్పినా, విపక్ష సభ్యులు పట్టువీడలేదు. సోమవారం ప్రశ్నోత్తరాలు జరగలేదని, మంగళవారం కూడా జరగకపోతే ఎలా? అని స్పీకర్ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. అంతకంటే ముఖ్యమైన అంశం ఉన్నందున వాయిదా వేయాలని కోరినా, స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. విపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించడంతో, ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రశ్నోత్తరాలు సహా ఎజెండా మొత్తాన్ని పక్కనబెట్టి ప్రత్యేకహోదా మీద చర్చ చేపడదామని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. 'ప్రత్యేకహోదా అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని కోసం తాము చేస్తున్న పోరాటం వల్ల అధికార పక్షానికే ప్రయోజనం. రాజకీయాలకు అతీతంగా తాము ముందు వరుసలో నిలబడి ప్రత్యేకహోదా సాధనకు పోరాటం చేస్తున్నాం. సోమవారం మధ్యాహ్నం 1.30గంటలకు చర్చ మొదలుపెట్టి 2గంటలకు ముగిం చారు. సభ్యులకు ఇచ్చిన ప్రతు ల్లో ఉన్న అంశాలు కాకుండా ముఖ్యమంత్రి ఏదేదో మాట్లాడారు. ఇప్పుడే అన్ని అంశాలను పక్కనబెట్టి ముఖ్యమంత్రిని ప్రత్యేకహోదాపై ప్రకటన చేయమనండి. వెంటనే చర్చ చేపడదాం. ఆఖరున అరగంటలో ప్రకటన చేసి, చర్చ లేకుండా చే యాలని చూస్తున్నారు. అన్ని అంశాలను పక్కనబెట్టి నేరుగా ప్రత్యేకహోదాపై చర్చలోకి వెళదామా? లేక సమావేశాలను 15రోజులకు పొడిగిద్దామా? మీరే తేల్చండి' అని స్పష్టంగా చెప్పారు.

     ప్రతిపక్షం ఒత్తిడితో ఎట్టకేలకు చర్చ

     ప్రశ్నోత్తరాలు ఉండాల్సిందేనని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. ప్రత్యేకహోదా మీద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం ముందు నిలబడి నినాదాలతో హోరెత్తించారు. సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో 9.23గంటలకు సభను 15నిమిషాలపాటు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం

     

     కాగానే మిగతా ఎజెండాను వాయిదా వేసి ప్రత్యేకహోదా అంశంపై చర్చను చేపట్టారు. చర్చ అనంతరం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

     

     ప్రత్యేక హోదాపై తీర్మానం ఇదీ..తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి

     ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. ప్రత్యేకహోదాపై శాసనసభలో చర్చ అనంతరం చివరలో సీఎం ఈ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానం...

     ''ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేయాలని 2014, ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానాలు... రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి కొరకు పన్ను రాయితీలు, నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, ఆర్థికలోటు భర్తీకి నిధుల విడుదల, 13వ షెడ్యూల్‌లోని విద్యాసంస్థల స్థాపన, ఇతర మౌలిక వసతుల కల్పన, చట్టంలోని సెక్షన్-8 అమలు, పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణం సహా అన్ని హామీలను అమలు చేయడం ద్వారా పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రానికి సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది.''

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top