పాత పాటే..

పాత పాటే.. - Sakshi


► పారిశ్రామిక కారిడార్..ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా మారుస్తానంటూ హామీ

ఇచ్చిన హామీలకు నిధుల ప్రస్తావన లేదు

రిజర్వాయర్ల కింద సాగు చేసింది 6 లక్షల ఎకరాలైతే..  8.50 లక్షల ఎకరాలకు నీరిచ్చామన్న సీఎం.

లక్షల ఎకరాలు ఎండిపోతే.. పంటల్ని కాపాడామని గొప్పలు

పింఛను తొలగించారని ప్రశ్నించిన వికలాంగుడు

సీఎం ప్రసంగిస్తుండగానే లేచి వెళ్లిపోయిని మహిళలు

హడావుడిగా సాగిన సీఎం చంద్రబాబు కార్యక్రమం


 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ముఖ్యమంత్రి హోదాలో ఆరోసారి జిల్లాకు వచ్చిన బాబు కార్యక్రమం హడావుడిగా.. చప్పగా ముగిసింది. కొత్తసీసాలో పాత సారా అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం సాగింది. గతంలో ఇచ్చిన హామీలకు ఎటువంటి క్లారిటీ లేకుండా కార్యక్రమాన్ని ముగించుకుని తిరుగు పయనమయ్యారు. తూపిలిపాళెంలో సుమారు రూ.600 కోట్లతో ఏర్పాటు చేయనున్న సునామీ, సముద్ర పరిశోధన కేంద్రానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, హర్షవర్ధన్, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసరావు, నారాయణ, గోపాలకృష్ణారెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తదితరులు శంకుస్థాపన చేశారు.



అనంతరం విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కొత్త వరాలతో పాటు.. గతంలో ఇచ్చిన హామీల అమలుకు నిధులు మంజూరు విషయంపై ప్రకటన చేస్తారని భావించారు. అయితే ఎక్కడా ఆ ప్రస్తావన రాలేదు. అయితే నెల్లూరు జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంచుతానని ప్రకటించారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలు పారిశ్రామిక కారిడార్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మరోసారి చెప్పుకొచ్చారు.



మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... జిల్లాలో రిజర్వాయర్ల కింద 6 లక్షల ఎకరాలు సాగైతే.. 8.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పంటలను కాపాడమని చెప్పటం సభకు హాజరైన రైతులు నవ్వుకోవటం కనిపించింది. సాగునీరందక సుమారు లక్ష ఎకరాలకుపైగా పంటలు ఎండిపోతే... ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎండిన పంటల గురించి కానీ.. అకాల వర్షంతో నష్టపోయిన పంటల గురించి ప్రస్తావించకుండా.. అంతా బాగుందనే విధంగా సీఎం మాట్లాడటంవిమర్శలకు దారితీసింది. రుణమాఫీకి ఇంత వరకు నిధులు విడుదల చేయకపోయినా.. రైతులను రుణ విముక్తుల్ని చేసిన ఘనత తమదేనని గొప్పలు చెప్పారు.



పింఛను తొలగించారంటూ వికలాంగుడు ఆగ్రహం



సీఎం సభలో పింఛన్ల గురించి ప్రస్తావన కొచ్చిన సమయంలో వికలాంగుడొకరు లేచి తనకు పింఛను తీసేశారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వెళ్లి వికలాంగుడు నోరెత్తకుండా అడ్డుకున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చెప్పిన విషయాలే మళ్లీ చెపుతుండటంతో మహిళలకు విసుగొచ్చి మధ్యలోనే లేచి వెళ్లిపోవటం కనిపించింది. దీంతో సీఎం చంద్రబాబు ఒకింత నిరాశకు గురికావటంతో పోలీసులు అప్రమత్తమై వెళ్లిపోతున్న వారిని  కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. ఇక చేసేది లేక సీఎం తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించేశారు.



సభలో మోదీ, వెంకయ్యని పొగిడిన సీఎం



రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటంతో జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం, ప్రధాని, వెంకయ్యనాయుడు, సీఎం దిష్టిబొమ్మలను తగులబెడుతుంటే... సీఎం చంద్రబాబు మాత్రం ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తటం గమనార్హం. అదేవిధంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా సీఎం చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. తెప్పించుకునే విధంగా పోరాడకపోయినా ఒకరినొకరు పొగుడుకుంటుండటంతో సభకు హాజరైన వారంతా నవ్వుకోవటం కనిపించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top