లక్ష్య సాధనతో ముందుకు సాగాలి


వరంగల్ స్పోర్ట్స్ : క్రీడారంగంలో లక్ష్య సాధనతో ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య విద్యార్థులకు సూచించారు. హన్మకొండ జేఎన్‌ఎస్‌లో మూడు రోజులపాటు జరిగే 60వ ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లాస్థాయి క్రీడోత్సవాలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి.. 11 జోన్ల క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించడం ద్వారా పల్లెల్లో చదువుకుంటున్న విద్యార్థులు క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉందన్నారు.



గ్రామీణ క్రీడలను ప్రభుత్వం మన ఊరు, మన ప్రణాళిక ద్వారా ప్రోత్సహించేందుకు నిధులు కేటాయించనుందన్నారు. ప్రణాళికాబద్ధంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. తాను కూడా విద్యార్థి దశలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆడానని, బ్యాడ్మింటన్‌లో జాతీయస్థాయిలో ఆడానని గుర్తు చేశారు. జిల్లాలోని క్రీడాకారులకు అన్ని రకాల వసతులు సమకూర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.



డీఈఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అన్నారు. పీఈటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ మాట్లాడుతూ మార్చ్‌ఫాస్ట్ చేసే విద్యార్థులకు కనీసం బూట్లు, క్రీడా దుస్తులు లేవని అన్నారు. వచ్చే ఏడాదిలోపు ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని అందించినా.. లేకున్నా తాను జిల్లాలోని 11 జోన్లకు ఒక్కో జోన్‌కు రూ.10వేల చొప్పున అందిస్తానని అన్నారు. అనంతరం పెద్ది వెంకటనారాయణగౌడ్‌ను డిప్యూటీ సీఎం శాలువాతో సత్కరించారు.



కాగా, పరకాల జోన్ చిన్నారులు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, జనగామ, చేర్యాల, తొర్రూరు, వరంగల్ సిటీ, హన్మకొండ సిటీ, హన్మకొండ రూరల్ జోన్ల నుంచి అండర్-14,17 విభాగాల్లో ఆడేందుకు హాజరైన క్రీడాకారులతో జేఎన్‌ఎస్ కళకళలాడింది. కార్యక్రమంలో డీఎస్‌డీఓ శివకుమార్, జిల్లా పీఈటీల సంఘం మాజీ సెక్రటరీ కత్తి కుమారస్వామి, జిల్లా ఎస్‌జీఎఫ్‌ఐ సెక్రటరీ సురేందర్, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతపురం ప్రవీణ్‌కుమార్, వరికోటి వాసుదేవరావ్, వెంకటేశ్వర్లు, శంకర్‌నాయక్, కుమార్, శ్రీధర్ పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top