విమానం.. వివాదం


 మా ‘లీజు’ భూములివ్వలేం

     కలెక్టర్‌కు స్పష్టం చేసిన

     మైనింగ్ లీజుదారులు

     విమానాశ్రయం కోసం

     ఇవ్వాల్సిందేనంటున్న ప్రభుత్వం

     500 ఎకరాల్లో 30 మందికి లీజులు

     లీజు గడువు మరో పదేళ్లు

     ఉందని లీజుదారుల వాదన

 సాక్షి ప్రతినిధి, కర్నూలు:

 మైనింగ్ లీజుల రచ్చ, బడ్జెట్‌లో నిధుల లేమితో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ కాస్తా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి చందంగా మారింది. తమ మైనింగ్ లీజు భూములు ఇచ్చేది లేదని సుమారు 30 మంది లీజుదారులు కలెక్టర్‌ను కలిసి తమ వాదన వినిపించినట్టు తెలిసింది. లీజు గడువు మరో పదేళ్లు ఉన్న సమయంలో భూములను విమానాశ్రయానికి ఠమొదటి పేజీ తరువాయి

 ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే, జిల్లా సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మైనింగ్ లీజు భూములు ఇవ్వాల్సిందేనని వారికి కలెక్టర్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ 30 మంది లీజుదారుల చేతుల్లో సుమారు 500 ఎకరాల భూమి ఉన్నట్టు భూగర్భగనులశాఖ అధికారులు లెక్క తేల్చారు.

 ఇవ్వాల్సిందే... మేమివ్వలేం!

 కర్నూలుకు కేవలం 17 కిలోమీటర్ల దూరంలో సుమారు 2,760 ఎకరాల విస్తీర్ణంలో ప్రాంతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేతవరం, పుడిచెర్ల, ఓర్వకల్లు, కన్నమడకల గ్రామాల పరిధిలో ఏర్పాటు కానున్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో భాగంగా విమానాశ్రయం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో అటు డీఆర్‌డీవో, ఎన్‌ఎఫ్‌సీతో పాటు పలు ఇతర ప్రైవేట్ సంస్థలు తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ముందుకొచ్చాయి. వీటిలో కొన్ని పరిశ్రమలు భూముల కోసం కొంత మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)కి డిపాజిట్ కూడా చేశాయి. ఇందుకు అనుగుణంగా ఏపీఐఐసీ కూడా భూసేకరణ ప్రక్రియను తీవ్రతరం చేసింది. అయితే, విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదన భూముల్లో ఖనిజ నిల్వలు ఉన్నాయని భూగర్భ గనులశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో లీజుదారులతో రెండు రోజుల క్రితం కలెక్టర్ సమావేశమయ్యారు. లీజుకు తీసుకున్నప్పటికీ.. ఇప్పటికీ తవ్వకాలు ప్రారంభించని నేపథ్యంలో భూములను తిరిగివ్వాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. ఇందుకు వారు ససేమిరా అంటున్నారు.

 ఆది నుంచీ అడ్డంకులే...!

 కర్నూలు జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన. ఇందుకు అనుగుణంగా ఆయన హయంలో టెండర్లు కూడా పిలిచారు. అయితే, మొదటిసారి 2008 చివర్లో టెండర్లు పిలిచినప్పుడు ఏ ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. టెండరులో పేర్కొన్న మేరకు రాయితీలు ఇస్తే తమకు పెద్దగా లాభసాటి కాదని భావించినందువల్లే ప్రైవేట్ సంస్థలు పెద్దగా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు అదనపు రాయితీలు ఇవ్వాలని 2009 ఎన్నికల అనంతరం ఆయన నిర్ణయించారు. ఈ మేరకు అప్పట్లో రాష్ట్ర కేబినెట్ కూడా తీర్మానం చేసింది. అదనపు రాయితీలతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమైన తరుణంలో ఆయన మరణించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదన కాస్తా అటకెక్కింది. అయితే, తాజాగా చంద్రబాబు ప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టింది. కానీ, విమానాశ్రయం ఏర్పాటుకు అనుగుణంగా భూసేకరణకు నయాపైసా కూడా బడ్జెట్‌లో కేటాయించకపోవడం గమనార్హం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top