రెడ్డిగారూ.. హామీలు గుర్తున్నాయా?

రెడ్డిగారూ..  హామీలు గుర్తున్నాయా?


సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఆయన పేరు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి.. కళాబంధు అనే పేరుతో అందరికీ సుపరిచితుడు. ఏ కళాకారుడిని సన్మానించాలన్నా.. అవార్డులివ్వాలన్నా ముందుంటారు. అదేవిధంగా హామీలు ఇవ్వడంలోనూ దిట్ట. అటువంటి సుబ్బిరామిరెడ్డి దీర్ఘ విరామం తర్వాత నెల్లూరుకు వస్తున్నారు. 2012లో జరిగిన నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.



అప్పట్లో దేశవ్యాప్తంగా నెల్లూరు లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న సమయంలో టి.సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికను కాంగ్రెస్‌పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజులముందు సుబ్బిరామిరెడ్డి నెల్లూరులో మకాం వేసి స్థానిక ప్రజలకు రకరకాల హామీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఆయన సొంత జిల్లా నెల్లూరురైనప్పటికీ ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో మాత్రం సొంత ఊరు పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్లారు. అయితే జిల్లాలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉండడం, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ పవనాలు బలంగా వీస్తున్న తరుణంలో ఆయన ప్రవేశం జరిగింది.



అయితే జనంలోకి వెళ్లడానికి ముందు సినీ తారలతో పెద్ద కార్యక్రమాన్ని ఆర్భాటంగా ఏర్పాటు చేసి ఎన్నికల రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా జిల్లాకు లెక్కలేనన్ని వరాలు కురిపించారు. వేల కోట్ల రూపాయలు వ్యయం అయ్యే అభివృద్ధి పనులను ప్రకటించారు. అందులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన, కళాకారుల కోసం ఆడిటోరియం వివిధ సామాజిక వర్గాలు, ఉద్యోగసంఘాల వారికి భారీ హామీలు గుప్పించారు. అదే సమయంలో ఎంపీ ల్యాడ్స్ కింద పలు అభివృద్ధి పనులకోసం జెరాక్స్ లెటర్‌ప్యాడ్‌లో సంతకాలు పెట్టి ఇచ్చారు.



ఎన్నికల్లో పనిచేసినవారికి చెక్కులు కూడా ఇచ్చారు. ఈ సందర్భంలో ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సొంత నిధులు ఖర్చు చేస్తానని కూడా హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ఓటమి తప్పదని భావించి మధ్యలోనే నెల్లూరు నుంచి వెళ్లిపోయారు. తిరిగి జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు.



ఈ నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. నెల్లూరులో మంగళవారం సినీ నటుడు డాక్టర్ మోహన్‌బాబుకు బెజవాడ గోపాలరెడ్డి అవార్డు ప్రధానం చేయనున్న సందర్భంగా మాజీ మంత్రి సుబ్బిరామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు గతంలో ఇచ్చిన హామీలు, చెల్లని చెక్కులు, లెటర్‌ప్యాడ్లు గురించి నిలదీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top