‘ఎర్ర’ దొంగల వేటలో..సీన్ రివర్స్

‘ఎర్ర’ దొంగల వేటలో..సీన్ రివర్స్ - Sakshi

  • ‘ఆపరేషన్ రెడ్’ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న స్మగ్లర్ల బంధుగణం

  •  స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులపై కిడ్నాప్ కేసులు పెడుతున్న వైనం

  •  ‘ఎర్ర’ దొంగల వేటలో స్మగ్లర్ల బంధుగణం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కర్ణాటక, తమిళనాడులో స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకోగానే సమీపంలోని పోలీసుస్టేషన్‌లో బంధుగణం తమ మనిషి అదృశ్యమైనట్లు కేసు పెడుతోంది. ఆ వెంటనే చిత్తూరు జిల్లా పోలీసులు తమ మనిషిని కిడ్నాప్ చేశారంటూ మరో కేసు పెడుతోంది. వరుసగా కేసులు చుట్టుముట్టుతుండడంతో పోలీసులు బెంబేలెత్తుతున్నారు.

     

    సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, కర్నూలు, వైఎస్‌ఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ‘ఆపరేషన్ రెడ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసి.. పీడీ యాక్ట్‌ను ప్రయోగించి కటకటాల వెనుకకు పంపిస్తున్నారు. తొలుత ఎదురులేకుండా ఆపరేషన్ రెడ్ కొనసాగినా ఇప్పుడు పోలీసులు వెనుకంజ వేస్తున్నా రు. తమిళనాడు, కర్ణాటక పోలీసులు సహకరిం చకపోవడం ఒక కారణమైతే.. స్మగ్లర్ల అనుచరు ల దాడులు, బంధువులు పెట్టే కేసులు మరొక కారణం.



    దేశంలో పేరుమోసిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రియాజ్‌ది కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని కటికినహళ్లి. ఆ గ్రామంలో రియాజ్ బంధుగణంలో 21 మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లుగా గుర్తింపు పొందారు. ఇందులో రియాజ్‌తోపాటూ మరో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రియాజ్‌ను అదుపులోకి తీసుకునేందుకు జిల్లా పోలీసులు కటికినహళ్లికి వెళ్లినప్పుడు.. ఆ గ్రామంలో స్మగ్లర్ల అనుచరులు వీరిపై దాడి చేశారు.



    ఆ దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికి సమీపంలోని హొస్కోట పోలీసుస్టేషన్‌కు మన జిల్లా పోలీసులు సమాచారం అందించినా స్పందన కరువైంది. చివరకు ఎలాగోలా రియాజ్‌ను అరెస్టు చేసి.. పీడీ యాక్ట్‌ను ప్రయోగించి కటాకటాల వెనుకకు పంపడంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. కానీ.. ఇప్పుడు కటికినహళ్లిలో మిగిలిన 16 మందిని అరెస్టు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. నాలుగు రోజుల కిత్రం చిత్తూరు నుంచి ఓ ప్రత్యేక పోలీసు బృందం మారువేషాల్లో కటికినహళ్లికి వెళ్లింది. రియాజ్ అనుచరుడైన నౌషద్ అనే అంతర్జాతీయ స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని, చిత్తూరుకు తరలించింది.



    ఇది పసిగట్టిన నౌషద్ బంధుగణం.. హొస్కోట పోలీసుస్టేషన్‌కు వెళ్లి తమ మనిషి కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది. హొస్కోట పోలీసుస్టేషన్‌లో నౌషద్‌ను చిత్తూరు పోలీసులు కిడ్నాప్ చేసినట్లు స్మగ్లర్ల అనుచరులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు పోలీసులపై హొస్కోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో కర్ణాటక, తమిళనాడలోని పలు స్టేషన్లలో మన జిల్లా పోలీసులపై కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. కర్ణాటక, తమిళనాడు పోలీసులు సహకరించాల్సింది పోయి కేసులు బనాయిస్తుండటం‘ఆపరేషన్ రెడ్’కు ప్రతిబంధకంగా మారుతోందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top