అడ్డుపడితే తప్పించాలనుకున్నారు

అడ్డుపడితే తప్పించాలనుకున్నారు - Sakshi


- విచారణలో ఎర్ర కూలీలు చెప్పారని ఏఎస్పీ వెల్లడి

- కలసపాడు అటవీ ప్రాంతంలో పోలీసులు, అటవీ శాఖ సంయుక్త దాడి

- 19 మంది తమిళ కూలీల అరెస్ట్

- 111 ఎర్రచందనం దుంగలు, ఐచర్ వాహనం, గొడ్డళ్లు స్వాధీనం

కడప అర్బన్ :
కాశినాయన మండల పరిధిలో గురువారం తెల్లవారుజామున పోలీసు, అటవీ శాఖ సంయుక్త దాడిలో పట్టుబడిన తమిళ కూలీలు తీవ్ర నిర్ణయాలతో అడవిలో అడుగు పెట్టారని ఏఎస్పీ (ఆపరేషన్స్) రాహుల్‌దేవ్ శర్మ పేర్కొన్నారు. ఘటన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. తమిళనాడులోని వేలూరు జిల్లా వసంతపురం, చెంగం గ్రామాలకు చెందిన కూలీలు నెల క్రితం కర్ణాటకలోని కటిగనహళ్లి గ్రామంలో ఫయాజ్ షరీఫ్, కాలా ఫయాజ్, మౌల, బాబు బాయ్, మురగేషన్ తదితరులతో సమావేశమై ఎర్రచందనం దుంగలను సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఇందులో భాగంగా వారు కర్ణాటకకు చెందిన మరికొందరితో కలిసి మొత్తం 26 మంది జిల్లాలోని అడవుల్లోకి ప్రవేశించారన్నారు.



దుంగలను రవాణా చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుపడితే వారిని చంపి అయినా గమ్యం చేరాలని నిర్ణయించుకున్నారని పట్టుకున్న వారిని విచారించినప్పుడు తమకు తెలిసిందన్నారు. ఎర్రచందనం దుంగలను నరికి రవాణాకు సిద్ధం చేస్తుండగా తమకు సమాచారం అందిందని చెప్పారు. ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓ రవిశంకర్, సిబ్బందితో కలిసి తాము గురువారం తెల్లవారుజామున కాశినాయన మండలం కొత్తకోట దాసరిపల్లె రిజర్వు ఫారెస్టులోకి వెళ్లామన్నారు. తోకరస్తా ప్రాంతంలో కూలీలు ఐచర్‌లోకి దుంగలు ఎత్తుతూ కనిపించగానే చుట్టుముట్టామన్నారు. వారు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి యత్నించగా, చాకచక్యంగా 19 మందిని పట్టుకున్నామని, ఏడుగురు తప్పించుకుని పారిపోయారని వివరించారు.

 

రూ.6 కోట్లకు పైగా విలువ చేసే 111 దుంగలు, ఐచర్ వాహనం, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కూలీలను పట్టుకోవడంలో సహకరించిన మైదుకూరు డీఎస్పీ ఎం.రామకృష్ణయ్య, ఎస్‌బీ డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ కె.నరసింహామూర్తి, బి.కోడూరు ఎస్‌ఐ హరిప్రసాద్, పోరుమామిళ్ల ఎస్‌ఐ కృష్ణం రాజునాయక్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు జి.రాజేంద్రప్రసాద్, పుల్లయ్య, ఎస్‌ఐలు జె.శివశంకర్, ఎస్‌కే రోషన్, రాజరాజేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఎం బాష, నాగరాజు, వారి సిబ్బందితోపాటు అటవీ శాఖ అధికారులు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రామ్మోహన్‌రెడ్డి, ట్రైనీ రేంజ్ ఆఫీసర్ యామిని సరస్వతి, ఎఫ్‌ఎస్‌ఓ వెంకట శేషయ్యలను ఆయన అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top