‘పచ్చ’ పందేరం

‘పచ్చ’ పందేరం - Sakshi


నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం

తుడా చైర్మన్ కోసం పలువురి యత్నాలు

భర్తీకాని కాణిపాకం, శ్రీకాళహస్తి ట్రస్టు బోర్డు పదవులు

కుప్పంలో పోస్టులకు సీఎం చుట్టూ ప్రదక్షిణలు

గ్రూపులుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు


 

కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న పదవుల పందేరానికి ముఖ్యమంత్రి  తెరలేపారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల టీటీడీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నామినేటెడ్ పదవులపై అధికార పార్టీ నేతలు ఆశలు పెంచుకున్నారు. పలువురు నేతలు తమ స్థాయిని బట్టి రాష్ట్ర, జిల్లా స్థాయి పదవుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితోపాటు స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు మరో ముందడుగు వేసి సీఎం తనయుడు లోకేష్  వద్దకు తిరుగుతున్నారు.

 

తిరుపతి: ప్రతి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పోటీ పెరగడంతో అధిష్టానం సైతం పదవుల పంపకాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది.

 

తుడాపై ఆశలు ఎన్నో...



తుడా చైర్మన్ పదవిపై పలువురు తెలుగు తమ్ముళ్లు ఆశలు పెంచుకున్నారు. పదవి కావాలంటూ పలువురు ఆశావహులు సీఎం వద్దకు వెళ్లి పట్టుపడుతుండటంతో ఆయన ఎటూ తేల్చలేకపోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చైర్మన్ రేస్‌లో ఓ బీసీ నేతతో పాటు మరో ఇద్దరు డాక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికే ఎమ్మెల్యే పదవితో పాటు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై బాబుపై కొందరు ఉన్నత వర్గాల వారు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారు తుడా చైర్మన్‌తో పాటు, మేయర్ పదవులను సైతం దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే భవిష్యత్ కార్యాచరణపై నగరంలో రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే చంద్రబాబునాయుడు బీసీలకు మేయర్ పదవి ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించడం గమనార్హం. తాతయ్య గుంట గంగమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ పదవికోసం పలువురు టీడీపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

 

కుప్పంలో సైతం గట్టి పోటీ




కుప్పంలో సైతం నామినేటెడ్ పదవులపై గట్టి పోటీ నెలకొంది. రెస్కో చైర్మన్ పదవి విషయంలో ఇరువురు నేతలు వర్గాలుగా ఏర్పడి ఒకరు చంద్రబాబునాయుడుని, మరొకరు లోకేష్‌బాబుతో కలసి పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కుప్పం మార్కెట్ కమిటీకి సైతం ఆశావాహుల సంఖ్య పెరగడంతో ఇంకా సీఎం నిర్ణయం తీసుకోలేదు. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు నియామకం విషయంలో మాత్రం ఓ పేరు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పుంగనూరు, పీలేరు, పుత్తూరు, సత్యవేడు, చిత్తూరు మార్కెట్ కమిటీల చైర్మన్‌ల విషయంలో పోటీ తీవ్రంగా ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top