నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు : మంత్రి రవీంద్ర


మచిలీపట్నం టౌన్ : వసతి గృహాల్లో అధికారులు, సిబ్బంది లేని తీరు, నీళ్ల చారు.. కూర వండి వడ్డించని వైనం.. పురుగులతో కూడిన సుద్దన్నం.. మరుగుదొడ్లలో లైట్లు వెలగని స్థితి.. కాలం చెల్లిన మందులు.. అస్తవ్యస్తంగా హాజరు పట్టీల నిర్వహణ.. పిచ్చిమొక్కలు, గడ్డి దట్టంగా పెరిగిన ఆవరణలతో కూడిన వసతి గృహాలు సాక్షాత్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు దర్శనమిచ్చిన దృశ్యాలు.



మంత్రి రవీంద్ర ఆదివారం స్ధానిక పోతేపల్లి రోడ్‌లో ఉన్న బీసీ, ఎస్టీ సంక్షేమ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో కన్పించిన సం ఘటనలు. స్వయంగా తానే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని వసతి గృహాల పరిస్థితి చూసి మంత్రి ఆశ్చర్యపోయారు. తొలుత ఆయన బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సమయంలో వసతిగృహంలో వార్డెన్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బంది లేరు.



విద్యార్థులకు వడ్డించేందుకు  అన్నం, నీళ్లచారును అక్కడి సిబ్బంది సిద్ధం చేశారు. కూర మాత్రం వండలేదు.  బాలికల వసతి గృహంలో ఉద్యోగులు బాధ్యతగా ఉండకుండా వసతి గృహానికే రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఆయన పరి శీలిస్తుండగా బీసీ వసతి గృహ వార్డెన్ టీ అనితకుమారి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.



బీసీ వసతి గృహ బాలికలతో కొద్దిసేపు మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వార్డెన్ గదిలోకాలం చెల్లిన మందులు ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారుతోందన్నారు.



ఎస్టీ బాలికల వసతి గృహంలో ఉన్న 19మంది విద్యార్థినులకు కూర లేకుండా నీళ్లచారు.. పురుగులతో కూడిన అన్నాన్ని వడ్డించిన వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  వసతి గృహంలోని మరుగుదొడ్లకు లైట్లు వెలగకున్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హాజరుపట్టీల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉం దని, విద్యార్థినుల మూమెంట్ రిజిస్టర్‌ను నిర్వహించకపోవడాన్ని మంత్రి పశ్నించారు.

 

త్వరలో బయోమెట్రిక్ విధానం



విధుల నిర్వహణలో వసతిగృహాల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బందరులోని వసతి గృహాలలో సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారితీరును ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి నెలా పేరెంట్స్ మీటింగ్‌లు పెట్టాలని సూచించారు. త్వరలో అన్ని వసతి గృహాలలో విద్యార్థులు, సిబ్బందికి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు వేసే పద్ధతిని అమలు చేస్తామన్నారు. మునిసిపల్ చైర్మన్ మోట మర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాళీవిశ్వనాథం, బీసీ సంక్షేమశాఖ డీడీ సీహెచ్ చినబాబు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top