బంధువులే బందూకులై..


 భూతం దుర్గారావు హత్య కేసులో ప్రధాన

 నిందితుడు నాగరాజుపై హైదరాబాద్‌లో కాల్పులు

 ఏడాదిగా కొనసాగుతున్న హత్యల పరంపర

 పినకడిమిలో ఆరని ప్రతీకార జ్వాల

 

 ఏలూరు (వన్‌టౌన్)/పెదవేగి రూరల్ :పెదవేగి మండలం పినకడిమిలో బంధువుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్నకక్షలు మరోసారి పడగవిప్పాయి. రెండు కుటుంబాల మధ్య ఐదేళ్ల క్రితం తలెత్తిన వివాదం గత ఏడాది నలుగురిని బలి తీసుకోగా, భూతం దుర్గారావు హత్య కేసులో ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజుపై హైదరాబాద్ సరూర్‌నగర్ జింకలబావి ప్రాంతంలో దుండగులు తపంచాతో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నాగరాజు ఆసుపత్రి పాలయ్యాడు. రాష్ట్రాలు మారినా.. దేశాలు, ఖండాలు దాటినా పినకడిమికి చెందిన బంధువుల మధ్య పగలు, ప్రతీకారాలు మాత్రం వదల్లేదు. జ్యోతిష్యంలో  ప్రాచుర్యం పొంది.. వ్యాపారాల్లో అడుగుపెట్టి,  మెట్రో నగరాలతోపాటు దేశ, విదేశాల్లో పాగా వేసిన ఒకే సామాజిక వర్గానికి కుటుంబాల మధ్య తలెత్తిన కక్షలు వరుస హత్యలకు దారితీస్తున్నాయి.

 

 దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే..

 ఏలూరులోని జేకే ప్యాలెస్ హోటల్ అధినేత భూతం దుర్గారావు కుటుంబ వివాదాల నేపథ్యంలో పినకడిమిలో 2014 ఏప్రిల్ 6న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులైన గంధం పగిడి మారయ్య, గుంజుడు మారయ్య, గంధం నాగేశ్వరరావు అదే ఏడాది సెప్టెంబర్ 24న కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు వస్తుండగా, కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద కిరాయి హంతకులు తుపాకులతో కాల్చిచంపారు. దీనికి కొనసాగింపుగానే దుర్గారావు హత్య కేసులో ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజుపై తాజాగా హైదరాబాద్ సరూర్‌నగర్‌లో దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు.

 

 ఇలా మొదలైంది..

 పెదవేగి మండలం పినకడిమిలో జ్యోతిష్యాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాటిలో రెండు కుటుంబాల మధ్య ఐదేళ్ల క్రితం తలెత్తిన కుటుంబ వివాదం ఆ తర్వాత రాజకీయ రంగు పులుముకుంది. జ్యోతిష్యుడు, ఏలూరులోని జేకే ప్యాలెస్ హోటల్ అధినేత భూతం దుర్గారావు పినకడిమి గ్రామంలో ఓ రాజకీయ పార్టీ తరఫున పెద్దగా ఉండేవారు. ఆయన సూచించిన వారికే పదవులు దక్కేవి. దుర్గారావు సోదరుడు గోవిందు కుమార్తెను అదే గ్రామానికి చెందిన తూరపాటి నాగరాజు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. కాగా, ఐదేళ్ల క్రితం గోవిందు కుమార్తె నాగరాజు కుమారుడిపై వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో మాజీ ఎంపీటీసీ పామర్తి వెంకటేశ్వరరావుకు తిరిగి ఎంపీటీసీ టికెట్ ఇచ్చేందుకు దుర్గారావు నిరాకరించడంతో వివాదంలోకి రాజకీయం అడుగుపెట్టింది.

 

 వరుస ఘాతుకాలు

 ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ 6న రాత్రి భూతం దుర్గారావు పినకడిమి గ్రామంలోనే హత్యకు గురయ్యారు. అప్పటికే గొడవలు పడుతున్న నాగరాజు, సీటు దక్కించుకోలేకపోయిన వెంకటేశ్వరావు కలిసి ఈ హత్య చేశారనే ఫిర్యాదుతో పోలీసులు వారితోపాటు నాగరాజు కుమారులను, నాగరాజు బావ గంధం నాగేశ్వరావు, అతని  కుమారులతో కలిపి మొత్తం 10మందిపై కేసు నమోదు చేశారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 24న కోర్టు వాయిదా ఉండటంతో పినకడిమిలో ఉండే గంధం నాగేశ్వరరావు ముంబై నుంచి వచ్చిన తన కుమారులు గంధం పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలను గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఏలూరుకు తీసుకువస్తుండగా, పెదఅవుటపల్లి వద్ద దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా నాగరాజు హైదరాబాద్ సరూర్‌నగర్‌లో కాల్పులకు గురయ్యాడు.

 

 ఏడాదిగా పరారీలోనే..

 దుర్గారావు హత్యకు గురైన తర్వాత పోలీసులకు చిక్కినట్టే చిక్కిన తూరపాటి నాగరాజు, అతని ఇద్దరు కుమారులు పరారయ్యారు. పోలీసులే అతన్ని తప్పించారని అప్పట్లో ప్రచారం జరిగింది. బుధవారం హైదరాబాద్‌లో నాగరాజు భార్య శ్రీదేవి కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పింది. అప్పట్లో పోలీసులే తమను ఏలూరుకు దూరంగా వెళ్లిపోవాల్సిందిగా సూచించారని, అందుకే హైదరాబాద్ వచ్చి తలదాచుకుంటున్నామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నాగరాజు ప్రత్యర్థులకు చిక్కడం గమనార్హం.

 

 నెరవేరుతున్న దుర్గారావు భార్య పంతం

 దుర్గారావు హత్య జరిగినప్పుడు అతని భార్య తిరుపతమ్మ తన భర్త మరణానికి కారణమైన వారందరినీ మట్టుబెట్టే వరకూ కర్మకాండలు నిర్వహించనని శపథం చేసింది. ఆ నేపథ్యంలోనే హత్యల పర్వం నడుస్తోంది. ప్రత్యర్థుల్లో ఒక్కొక్కరిని అంతమొందిస్తున్న దుర్గారావు సోదరుడు గోవింద్ ఎక్కడున్నాడన్నది ఇప్పటివరకు పోలీసులు గుర్తించలేకపోయారు. లండన్‌లో ఉంటూ పక్కా నెట్‌వర్క్‌తో హత్యల పరంపర కొనసాగిస్తున్నాడని చెప్పుకొస్తున్నా కనీసం అతని ఆచూకీ కూడా పోలీసులు కనుగొనలేకపోయారు. గత సెప్టెంబర్‌లో మూడు హత్యలు జరిగిన సందర్భంలో గోవింద్ ఆచూకీ కోసం ఇంటర్ పోల్‌ను ఆశ్రయిస్తున్నామని పోలీసులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. కాగా, నాగరాజు కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులకు తెలిసే ఇదంతా జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

 

 హత్యలు చేయిస్తున్నది అతడే

 హత్యలన్నీ గోవిందు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని నాగరాజు కుమార్తె లక్ష్మి ఆరోపించింది.  దుర్గారావు భార్య తిరుపతమ్మ శపథం మేరకు అందరినీ అంతం చేసేందుకు వేసుకున్న పథకం ప్రకారమే హత్యలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే కుటుంబ పెద్దదిక్కు గంధం నాగేశ్వరరావుతోపాటు, అతని ఇద్దరు కుమారులను కోల్పోయామని బుధవారం పినకడిమిలో విలేకరుల ఎదుట వాపోయింది. నాగరాజు తల్లి వీరమ్మ మాట్లాడుతూ తమ కుటుంబంపై పగబట్టిన గోవిందు తమను కూడా అంతమొందిస్తాడని వాపోయింది. పోలీసు రక్షణ కల్పించాలని, లేకుంటే తాము కూడా అకాల మరణానికి గురికావాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమైంది. తమ తండ్రులను, తాతను చంపారని తాము విద్యను, మనశ్శాంతిని కోల్పోయి అనునిత్యం భయాందోళనలో బతుకీడుస్తున్నామని మారయ్య, పగిడి మారయ్య కుమారులు విఘ్నేష్, ప్రసాద్, శ్రీచంద్, కుమార్తెలు అంబికా, అనూశ్రీ విలపించారు. దీనిపై ముఖ్యమంత్రిని కలిసి గోడును వెళ్లబోసుకునేందుకు అవకాశం కల్పించాలని  కుటుంబ సభ్యులంతా స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు.

 

 ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నాం : ఎస్పీ

 హైదరాబాద్ సరూర్‌నగర్‌లో తూరపాటి నాగరాజుపై కాల్పులు జరిగిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు కోసం జిల్లా నుంచి ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నట్టు ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ డీఎస్పీ, సీఐతోపాటు ఇద్దరు ఎస్సైలు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ కేసు విచారణ చేస్తున్న అధికారులకు సహకరిస్తారని చెప్పారు. పరంపరగా సాగుతున్న ఈ హత్యలకు అడ్డకట్ట వేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించిందన్నారు. వరుస హత్యలకు పాల్పడుతున్న గోవింద్‌ను, అతని అనుచరులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top