‘రియల్’ దోపిడీ!

‘రియల్’ దోపిడీ! - Sakshi


 బలహీనవర్గాలకు చెందిన డీ పట్టా భూములు దోపిడీదారుల ప్లాట్లుగా మారిపోయాయి. రియల్ మాఫియా చేతిలో చిక్కి ఇళ్ల స్థలాలుగా రూపం మార్చుకొని కాసుల వర్షం కురిపించాయి. అధికారుల అండతో నిబంధనలకు నిలువు పాతరేసి.. అమాయక లబ్ధిదారులను మాయమాటలతో మోసపుచ్చి రియల్ మాఫియా కోట్లు కూడబెట్టుకుంది. దీనిపై గ్రీవెన్స్‌సెల్‌లో పలుమార్లు ఫిర్యాదులు అందినా అధికార యంత్రాంగం కళ్లు తెరవడంలేదు. అక్రమార్కుల అంతు చూడటం లేదు.

 

 రాజాం రూరల్: అవన్నీ ఎప్పుడో 1975లో ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టా భూములు. పేద కుటుంబాలు వ్యవసాయం చేసుకుని ఫలసాయం అనుభవించేందుకు వీలుగా అప్పటి ప్రభుత్వం ఈ భూములు ఇచ్చింది. ఆ భూములన్నీ ఇప్పుడు అన్యాక్రాంతమై.. అక్రమార్కులకు కోట్లు కురిపిస్తున్నాయి. అప్పట్లో చిన్న గ్రామంగా ఉన్న గోపాలపురం బౌండరీ పరిధిలోని వాసవీ జూట్ మిల్లు వెనుక భాగంలో సర్వే నెం. 51/6లో 0.60 ఎకరాలు, 51/5లో 0.49 ఎకరాలు, 53/3లో 0.39 ఎకరాలు, 53/4లో 0.24 ఎకరాలు, 50/3లో 1.73 ఎకరాలు, 48/4లో 1.50 ఎకరాలు, 48/5లో 1.95 ఎకరాలు, 49/2లో 0.83 ఎకరాలు, 49/1లో 2.58 ఎకరాలు, 49/5లో 1.60 ఎకరాలు, 49/7లో 0.41 ఎకరాలు, 51/1లో 2.39 ఎకరాలు, 51/2లో 0.67 ఎకరాలు, 50/1లో 0.80 ఎకరాలు.. మొత్తం 16 ఎకరాలను ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున కేటాయించి డీ పట్టాలు ఇచ్చారు. కొంతకాలం లబ్ధిదారులు వాటిని సాగు చేసుకొని అనుభవించారు. 2000 సంవత్సరం తర్వా త ఏర్పడిన కరువు పరిస్థితుల్లో పంటలు పండక భూములు బీడువారి పోవడంతో లబ్ధిదారులు  కూలీలుగా మారిపోయారు.

 

 మాఫియా కన్ను

 రైతుల దుస్థితిని గమనించిన రియల్ మాఫియా వారి స్థలాలపై కన్నేసింది. ఇదే సమయంలో రాజాం నగర పంచాయతీ హోదా పొందడం, గోపాలపురం ప్రాంతం అందులో విలీనం కావడం, ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో భూము ల ధరలకు రెక్కలొచ్చాయి. అందులోనూ ఇళ్ల స్థలాలకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. దీంతో రైతుల పేరిట ఉన్న డీ పట్టా భూ ములను ఏదో రకంగా చేజిక్కించుకొని ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్ముకోవాలని రియల్టర్లు పన్నాగం పన్నారు. నిబంధనల మేరకు డీ పట్టా భూములను అమ్ముకోవడానికి వీల్లేదు. వాటిని సాగు చేసుకొని అనుభవించడమే తప్ప క్రయవిక్రయాలు నిషిద్ధం. ఈ ప్రతిబంధకాన్ని అధిగమించేందుకు రియల్టర్లు అధికారులను మ చ్చిక చేసుకున్నారు. మామూళ్లతో ముంచెత్తారు. అనంతరం లబ్ధిదారులైన రైతుల వద్దకు వెళ్లి వేల రూపాయల ఆశ చూపి ఆ భూ ములు తమకు అమ్మాలని ఒత్తిడి తెచ్చారు. ఈ భూములు అమ్మడానికి పనికిరావని, కేవలం పంటలు పండించుకోవడానికే ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని రైతులు చెప్పగా.. అవన్నీ మేం చూసుకుంటామని నమ్మబలికి అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు.

 

 తప్పుడు రిజిస్ట్రేషన్లు

 అలా చేజిక్కించుకున్న డీపట్టా భూములను ప్లాట్లుగా విభజించి అమ్మేస్తున్నారు. తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు సైతం చేయిస్తున్నారు. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన బ్యాంకు రుణాలు, ఫీజిబులిటీ సర్టిఫికెట్లు అందవని తెలియక చాలామంది వీటిని కొనేస్తున్నారు. ఇదొక్కటే కాకుండా.. రాజాం ప్రాంతంలో ఇలా చాలా భూములు రియల్‌మాయలో పడి ఇళ్ల స్థలాలుగా మారి చేతులు మారిపోతున్నాయి. వీటిపై పలువురు ఇప్పటికే  పాలకొం డ, రాజాంలలో జరిగే గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదులు చేశారు. అయినా ఇప్పటివరకు అధికారులు ఈ అక్రమాలపై దృష్టి పెట్టలేదు.

 

 క్రిమినల్ కేసులు పెడతాం

 ఈ విషయూన్ని రాజాం తాహశీల్దార్ రామారావు వద్ద ప్రస్తావించగా ఈ అంశం తన దృష్టికి వచ్చిందని, దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. సర్వే జరిపి డీపట్టా భూములైతే వాటిని స్వాధీనం చేసుకొని విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top