రాయబేరం

రాయబేరం


‘జీ హుజూర్’ల కోసం వెతుకులాట

 

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:

 అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇవ్వడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. తాము కోరుకున్న అధికారులకు కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు. సందట్లో సడేమియా..మాదిరిగా ఎమ్మెల్యేల అనుచరులు రంగప్రవేశం చేసి మంత్రాంగం నెరపుతున్నారు. అధికారంలోకి వచ్చి ఐదునెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో తమమాట చెల్లుబాటు కావడం లేదనే భావన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో నెల కొంది.



అనుకూలంగా ఉండే అధికారులు లేకపోవడం వల్లే పనులు చక్కదిద్దుకోలేకపోతున్నామనే భావన కనిపిస్తోంది. దీంతో కిందిస్థాయి అధికారుల వ్యవహారశైలిపైనా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు అందుతున్నారు. పాలనలో కీలకమైన ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులు తమ మాట ఖాతర్ చేయడం లేదని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులను నియమించాలని కొంతకాలంగా పార్టీ కీలకనేతలపై ఒత్తిడి తెస్తున్నారు.



జిల్లా నుంచి రాష్ట్రమంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడంతో మంత్రులు టి.హరీష్‌రావు, కేటీఆర్ వంటి నేతల చుట్టూ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన అధికారుల బదిలీ అంశంపై సీఎం కేసీఆర్ ఈనెల 24న(శుక్రవారం) జిల్లా ఎమ్మెల్యేలకు స్పష్టత ఇచ్చారు. తాము కోరుకునే అధికారుల జాబితా సమర్పించాలని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో జిల్లాలో ఒక్కసారిగా క్షేత్రస్థాయి అధికారుల బదిలీలపై ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు.



 జీ హుజూర్‌లకే పోస్టింగులు

 తహశీల్దార్లు, ఎస్‌ఐ, సీఐల వంటి కీలక అధికారుల పోస్టింగుల్లో ఇసుక, రియల్‌ఎస్టేట్ వ్యాపారంతో పాటు పారిశ్రామిక ప్రాంతం కీలకంగా మారినట్లు సమాచారం. అక్రమ ఇసుకదందా జోరుగా సాగే మండలాల్లో పోస్టింగుల కోసం సదరు అధికారులు ఎంతైనా సమర్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదే అదనుగా ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు రంగంలోకి దిగి బేరసారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత 54 మంది తహశీల్దార్లు, 47 మంది ఎస్‌ఐలు, డజన్ మందికి పైగా సీఐలు బదిలీఅయ్యారు. ఎస్‌ఐలుగా పోస్టింగులు పొందిన వారిలో ఎక్కువమంది కొత్తవారే ఉన్నారు.



తాజా ప్రతిపాదనల్లో వీరిని తప్పించి తమకు అనుకూలంగా ఉండే వారికి పోస్టింగులు ఇప్పించేందుకు ముఖ్యనేతలు పావులు కదుపుతున్నారు. జిల్లాలో ఏడుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా, ఐదుచోట్ల కాంగ్రెస్, రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీల ప్రతిపాదనలు కీలకంగా మారనున్నాయి. కాగా, గతంలో కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటూ తమను ఇబ్బందులను గురిచేసిన అధికారులపై కూడా అధికారపార్టీ నేతలు ప్రత్యేకదృష్టి సారించారు. ఓ వైపు తమకు కావాల్సిన అధికారుల కోసం వెతుకుతూనే తమను ఇబ్బందులకు గురిచేసిన వారికి కీలక పోస్టింగులు దక్కకుండా వ్యూహం సిద్ధంచేస్తున్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top