పండుగ పూటా పస్తులే..


సాక్షి ప్రతినిధి, తిరుపతి: మోకాలికి, బోడిగుండుకూ ముడేయడమంటే ఇదే..! ఆధార్ కార్డు లేదనే సాకు చూపి 1.35 లక్షల రేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కార్డులకు ఈనెల నుంచే రేషన్ కట్ చేసింది. దీపావళి పండుగ పూట నిరుపేదలను పస్తులు ఉండేలా చేసింది. జిల్లాలో జూన్ 8, 2014 నాటికి 11,20,532 రేషన్‌కార్డులు చలామణిలో ఉన్నాయి. ఇందులో తెల్లకార్డులు 9,85,036.. గులాబీకార్డులు 1,35,546. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం పేరుతో రాష్ట్రంలో ఈ-పీడీఎఫ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.



ఈ-పీడీఎఫ్ విధానం అమలుకు మన జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ విధానంలో రేషన్ దుకాణాలను కంప్యూటరీకరిస్తారు. రేషన్‌కార్డులను.. ఆధార్‌కార్డులనూ అనుసంధానం చేస్తారు. ఆధార్ నంబరుతో సరిపోని కార్డులను తొలగిస్తారు. రేషన్‌కార్డులూ.. ఆధార్‌కార్డుల సీడింగ్ పూర్తయిన తర్వాత.. వాటిని కంప్యూటరీకరిస్తారు. ఇవే రికార్డుల ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో రేషన్‌ను పంపిణీ చేస్తారు. ఈ-పీడీఎఫ్ విధానం అమల్లో భాగంగా జిల్లాలో ఆధార్ సీడింగ్ ప్రక్రియను ఇటీవల పూర్తిచేశారు. 8,50,036 తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు ఆధార్‌కార్డులను అందజేశారు.



ఆ కార్డుల సీడింగ్ పూర్తయింది. 1.35 లక్షల మంది లబ్ధిదారులు ఆధార్‌కార్డులు ఇవ్వలేదనే సాకు చూపి.. ఆ కార్డులను బోగస్‌గా గుర్తించి తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. కానీ.. ఇదే అధికారులు ఇప్పటికీ పది శాతం కుటుంబాలకు ఆధార్‌కార్డులు జారీచేయనట్లు అంగీకరిస్తుండడం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 11.25 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తేలింది. ఆధార్ కార్డుల జారీలో సేకరించిన లెక్కల ప్రకారం జిల్లాలో 11.87 లక్షల కుటుంబాలు ఉన్నట్లు వెల్లడైంది.



2011 నాటితో పోలిస్తే.. ఆధార్ కార్డుల జారీ సమయానికి జనాభా, కుటుంబాలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇవేవీ పట్టని అధికారులు.. ఆధార్ సీడింగ్‌ను పూర్తిచేశామని ప్రకటించి 1.35 లక్షల కార్డులను తొలగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ- పీడీఎఫ్ విధానంలో సరుకులను పంపిణీ చేయడానికి ఇప్పటికీ రేషన్ దుకాణాలను కంప్యూటకీరించలేదు. ప్రభుత్వం ఈ విధానం ఎప్పటి నుంచి అమలుచేస్తామన్నది ప్రకటించనే లేదు. కానీ.. అధికారులు మాత్రం ఈ-పీడీఎఫ్ విధానం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించేశారు.



ఈనెల బియ్యాన్ని 1.35 లక్షల కార్డుల లబ్ధిదారులకు అందించలేదు. ఆధార్ లేదనే సాకు చూపి వారందరికీ రేషన్‌ను కట్ చేశారు. బోగస్‌కార్డులను రద్దు చేయడం వల్ల నెలకు 27 వేల క్వింటాళ్ల బియ్యం ఆదా అవుతున్నాయని ప్రభుత్వానికి లెక్కలు పం పడం గమనార్హం. ఉన్నట్టుండి రేషన్‌కార్డులను రద్దు చేసి బియ్యం పంపిణీ చేయకపోవడంతో నిరుపేదలు తల్లడిల్లుతున్నారు. దీపావళి పండుగ పూట కూడా నిరుపేదలు పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top