రేషన్ డీలర్‌షిప్ నామినేటెడ్ పోస్టు కాదు

రేషన్ డీలర్‌షిప్ నామినేటెడ్ పోస్టు కాదు - Sakshi


చౌక దుకాణదారుల తొలగింపుపై హైకోర్టు వ్యాఖ్య

 

హైదరాబాద్: ఎన్నికల్లో తమకు సహకరించలేదనో.. తమకు చెందిన వారు కాదనో.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత చౌక దుకాణదారులను తొలగిస్తుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అలా తొలగించేందుకు రేషన్ డీలర్లు ఏమీ నామినేటెడ్ వారు కాదని వ్యాఖ్యానించింది. చౌక దుకాణ డీలర్‌గా నియమితుడైన వ్యక్తిని, కొంతకాలం మాత్రమే అధికారంలో ఉండే నేతల ఇష్టానుసారం తొలగించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డీలర్ కొనసాగింపు, నియామకం అధికార నేతల దయ మీద ఆధారపడి ఉండటానికి వీల్లేదంది. ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిదికాదని వ్యాఖ్యానించింది. వారి తొలగింపులో ప్రస్తుత విధానాన్ని, తీరును మార్చుకోవాలని అధికారులకు హితవు పలికింది. డీలర్లను తొలగిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.పాలక పక్ష నేతల ఆదేశాల మేరకు అధికారులు తమను తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు చౌక దుకాణాల డీలర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తొలగింపునకు వాస్తవాలతో నిమిత్తం లేకుండా చిన్న చిన్న లోపాలను కారణాలుగా చూపారని వారు కోర్టుకు నివేదించారు.



దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి ‘‘అధికారులు తమ తీరు మార్చుకోకుండా డీలర్లను తొలగిస్తున్నారు. తమకు నచ్చిన వారిని నియమించుకోవాలన్న ఉద్దేశంతోనే తమను తొలగిస్తున్నారన్న పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తమున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే ముందు రేషన్ డీలర్ షిప్ నామినేటెడ్ పోస్టు కాదన్నది అధికారులు గుర్తు పెట్టుకోవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను తమ చెప్పుచేతల్లో పెట్టుకుకోవాలనుకునే వారి చేతుల్లో అధికారులు ఉపకరణాలుగా మారరాదు’’ అని తన తీర్పులో పేర్కొన్నారు. నిర్దిష్ట ఆరోపణలు లేకుండా పిటీషనర్లను తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top