వినాయకుడి చుట్టూ ఎలుక ప్రదక్షిణలు

ప్రసాదం తింటున్న ఎలుక


వినాయక చవితి రోజున భక్తులకు వినాయకుడు ఎంత ముఖ్యమో.. ఆయన వాహనమైన ఎలుక కూడా అంతే ముఖ్యం. అనింద్యుడు అనే మూషికాన్ని వినాయకుడికి పరమశివుడు వాహనంగా ఇచ్చినట్లు వినాయకచవితి కథలో చెబుతారు. ఇప్పుడు అనంతపురం జిల్లా గుంతకల్లులో ఒక ఎలుక వినాయకుడి విగ్రహం చుట్టూ తిరుగుతూ, అక్కడే ఆయన తొండం మీద నివాసం ఏర్పరుచుకుని భక్తులు సమర్పించిన ప్రసాదాలు తింటూ అలాగే ఉండిపోయింది. వినాయక చవితి సందర్భంగా గుంతకల్లు లోని మునిసిపల్ బాలుర హైస్కూల్ సమీపంలో ఒక వినాయక మండపం ఏర్పాటు చేశారు.



శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడకు ఓ చిన్న ఎలుక వచ్చింది. వచ్చిందే తడవుగా విఘ్నేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. దాంతో భక్తులు పరమానంద భరితులయ్యారు. గణపతి బప్పా మోరియా.. ఆధా లడ్డూ ఖాలియా అంటూ ఆ మూషికానికి మరిన్ని లడ్డూలు, ఉండ్రాళ్లు పెట్టసాగారు. ఈ విషయం ఆనోట, ఈ నోట అందరికీ తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా జనం రావడం మొదలుపెట్టారు. స్వయంగా వినాయకుడే ఈ ఎలుక రూపంలో వచ్చి తమకు దర్శనం ఇచ్చాడంటూ మురిసిపోయారు. శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఆ ఎలుక ఆ విగ్రహం వద్దే ఉండటం విశేషం!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top