సీఏ ఫైనల్‌లో ఏపీ విద్యార్థులకు ర్యాంకులు

సీఏ ఫైనల్‌లో ఏపీ విద్యార్థులకు ర్యాంకులు - Sakshi


కృష్ణా జిల్లా విద్యార్థినికి 27వ ర్యాంకు, వైఎస్సార్‌ జిల్లా విద్యార్థికి 43వ ర్యాంకు



సాక్షి, న్యూఢిల్లీ/లబ్బీపేట (విజయవాడ తూర్పు): గతేడాది నవంబర్‌లో ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన సీఏ ఫైనల్, సీపీటీ ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. తమ విద్యార్థులు సీఏ ఫైనల్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన సాయిశ్రీలక్ష్మి ఆలిండియా స్థాయిలో 27వ ర్యాంకు, వైఎస్సార్‌ జిల్లా రాయచోటికి చెందిన మసాలా వెంకట సాయిచరణ్‌ 43వ ర్యాంకు సాధించినట్లు సూపర్‌విజ్‌ విద్యా సంస్థ ప్రిన్సిపాల్‌ సబ్బినేని వెంకటేశ్వరరావు తెలిపారు. సీపీటీలో కృష్ణా జిల్లాలోని కొమర వోలుకు చెందిన బిజ్జం వెంకటేశ్వరరెడ్డి 200 మార్కులకు అత్యధికంగా 194 మార్కులు సాధించినట్లు వివరించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆయన అభినం దనలు తెలిపారు. తమ విద్యార్థులను ర్యాంక ర్లుగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.



శ్రీ మేధావి విద్యార్థుల ప్రతిభ..

సీఏ సీపీటీ ఫలితాల్లో విజయవాడలోని శ్రీమేధావి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు ఆ విద్యా సంస్థ డైరెక్టర్లు ఫణి కుమార్, చైతన్య కిశోర్‌ తెలిపారు. తమ విద్యార్థులు ఎం.సాయికుమార్‌ 200 మార్కు లకు 186, ఎం.సంతోశ్‌కుమార్‌ 176 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. తమ విద్యార్థులు అత్యధిక పాస్‌ పర్సెంటేజ్‌ సాధిం చారన్నారు. విద్యారంగంలో తమకున్న అను భవంతో పోటీపరీక్షలకు అనుగుణంగా బోధన ప్రణాళికలు రూపొందిస్తూ, ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు.



లక్నో విద్యార్థినికి మొదటి ర్యాంకు: సీఏఎం దేవరాజరెడ్డి

సీఏ ఫైనల్‌ ఫలితాలను ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు సీఏఎం దేవరాజరెడ్డి మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. సీఏ ఫైనల్‌ గ్రూప్‌–1లో 37 వేల మంది పరీక్షకు హాజరైతే అందులో 2,655 మంది (7 శాతం), గ్రూప్‌–2లో 36 వేల మంది పరీక్షకు హాజరైతే 4,545 (12 శాతం) మంది, రెండు గ్రూప్‌లకు కలిపి 36 వేల మంది హాజరైతే 4,256 (11 శాతం) మంది ఉత్తీర్ణులైనట్టు ఆయన తెలిపారు. లక్నోకు చెందిన ఈతి అగర్వాల్, బివండికి చెందిన పియూష్‌ రమేశ్‌ లోహి, అహ్మదాబా ద్‌కు చెందిన జ్యోతి ముఖేష్‌ భాయ్‌ మొదటి మూడు ర్యాంకులు సాధించారు. సీపీటీ పరీక్షలకు 70 వేల మంది విద్యార్థులు హాజరైతే అందులో 46 శాతం ఉత్తీర్ణతతో 32,658 మంది అర్హత సాధించారు. సీఏలు దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నా రని, ఈ రంగంలో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా దేవరాజ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌కు ఐసీఏఐ తరఫున పలు ప్రతిపాదనలు చేసినట్టు తెలిపారు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం అమలులో ఐసీఏఐ పాత్రను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారని ఆయన పేర్కొన్నారు. నోట్ల రద్దు ఫలితాలు ఒక సంవత్సరం తరువాత స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు.



బిజినెస్‌కు ఉపయోగపడే కోర్సు చేయాలనీ..

నా తండ్రి వ్యాపారం చేస్తుంటారు. బిజినెస్‌కు ఉపయోగపడే కోర్సు చేయాలనే ఉద్దేశంతో సీఏలో చేరాను. అందువల్లే పట్టుదలతో చదివి ఈ కోర్సును పూర్తి చేసి, ఆలిండియా స్థాయిలో ర్యాంకును సాధించాను. ఈ ర్యాంకు సాధించడం ద్వారా తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ఇందుకు సూపర్‌విజ్‌ శిక్షణ ఎంతగానో దోహదపడింది.

              – సాయి శ్రీలక్ష్మి, సీఏ ఫైనల్‌ 27వ ర్యాంకర్‌



కూలీ పనులు చేసి చదివించారు

వైఎస్సార్‌ జిల్లాలోని రాయచోటిలో ఉండే మా తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ నన్ను సీఏ చదివిస్తున్నారు. వారి ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా నేను చదువుతూ ఆలిండియా స్థాయిలో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రేరణ ఇచ్చి పట్టుదల కలిగించిన గుప్తా గారి మోటివేషన్‌ను జీవితాంతం మరిచిపోలేను. సీఏ ఫైనల్‌లో ఆలిండియా ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది.

 – ఎం.వెంకట సాయిచరణ్, సీఏ ఫైనల్‌ ఆలిండియా 43వ ర్యాంకర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top