నీతి, నిజాయితీ బతికే ఉన్నాయ్


నిడదవోలు : ‘యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఎన్నికల ప్రచారం కోసం ఏ కాలేజీకి.. ఏ పాఠశాలకు వెళ్లినా ఉపాధ్యాయులు, నా వద్ద చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఆదరించారు. వారి సొంత ఖర్చులతో నన్ను ప్రచారానికి తీసుకెళ్లారు. నీతి, నిజాయితీలు ఇంకా బతికే ఉన్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు నిరూపించారు. నా విజయానికి కారణమైన యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడతా’నని ఎమ్మెల్సీగా ఎన్నికైన రాము సూర్యారావు అన్నారు. శుక్రవారం రాత్రి నిడదవోలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

  మత ప్రవక్తలు, మహనీయుల స్ఫూర్తితో, మనిషిలో దేవుడుంటాడనే నమ్మకంతో తన సొం త ఆస్తిని సైతం అమ్ముకుని వేలాది మంది పేద విద్యార్థులను చదివించానని చెప్పారు. వారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆనందం వ్యక్తం చేశారు. సీఆర్ రెడ్డి కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసినప్పటి నుంచి పేద రోగులకు సేవ చేస్తున్నానని, తనకు వచ్చే రూ.42 వేల పింఛను మొత్తాన్ని కూడా పేదలకు అవసరమైన మందుల కోసం ఖర్చు చేస్తున్నానని చెప్పారు.

 

 ఏ పేద రోగికి వైద్యం అందకపోయినా తాను సహాయపడతానన్నారు. పేద విద్యార్థులకు సాయం అందిస్తూనే ఉంటానన్నారు. ఏ పేద విద్యార్థి అయినా ఆర్థిక ఇబ్బం దుల వల్ల మధ్యలో చదువు ఆగిపోతే తనను సంప్రదిస్తే సహాయపడతానన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే క్రమంలో అవసరమైతే శాసనమండలిలోనే కాకుండా బయట కూడా పోరాటాలు చేస్తానన్నారు. ఆయన వెంట యూటీఎఫ్ నాయకులు జయకర్, గంగాధర్, సురేష్‌బాబు, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, సుందరబాబు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top