చెదిరిన ‘స్వగృహ’ కల


 కొన‘సాగు’తున్న రాజీవ్ స్వగృహ నిర్మాణాలు

  ఇప్పటికి 16 మందే చేరిక.. మరికొద్ది మంది సిద్ధం

  నిర్మాణ ం పూర్తి అయిన ఇళ్లు 189

  వాటిలో చేరేందుకు లబ్ధిదారుల అనాసక్తి

   డిపాజిట్ వాపసుకు 1300 మంది దరఖాస్తు


 

 ఎచ్చెర్ల:నిర్మాణాల్లో బాగా జాప్యం జరగడం, ఇప్పటికీ పూర్తిస్థాయిలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తదితర కారణాలతో రాజీవ్ స్వగృహలో చేరేందుకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. కొద్దిమంది ఇళ్లలో చేరినా అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పటికే నిర్మాణాలు పూర్తి అయిన ఇళ్లను వేలం వేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి ధరల్లో వాటిని కొనుగోలు చేసేందుకు ఎంతమంది ముందుకు వస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

 మధ్యతరగతి లక్ష్యంగా..

 మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలన్న ఉన్నతాశయంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రారంభించి, దీని పర్యవేక్షణకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని ఎస్.ఎం.పురం కొండపై సర్వే నెంబర్ 112లో 100 ఎకరాల స్థలం కేటాయించారు. అందులో 1094 ఇళ్లు నిర్మించి, దరఖాస్తుదారులకు రుణప్రాతిపదికన అందజేయాలని నిర్ణయించారు. ఆరు కేటగిరీలో నిర్మించే ఈ ఇళ్లకు నిర్ణయించిన ధరలు కూడా అందుబాటులో ఉండటంతో 5018 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.3వేలు చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు సైతం చెల్లించి ఆశగా ఎదురుచూశారు.

 

 వైఎస్ అనంతరం నిర్లక్ష్యం

 అయితే వైఎస్ మరణానంతరం ఈ పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును దాదాపు మూలన పడేశాయి. 1094 ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం కాగా తొలివిడతలో 200 ఇళ్లు నిర్మించి ఇవ్వాలనుకున్నారు. అయితే 189 నిర్మాణాలు ప్రారంభించి 54 మాత్రమే పూర్తి చేశారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికి 16 ఇళ్లలో లబ్ధిదారులు చేరగా, మరికొందరు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మిగతా ఇళ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.228 కోట్లు కేటాయించగా.. అందులో స్థలం చదును చేయడానికే రూ.24 కోట్లు వ్యయమైంది.

 

 విశాఖకు చెందిన ఎస్‌వీసీ కాంట్రాక్టు సంస్థ నిర్మాణాలు చేపట్టగా ప్రస్తుతం అనమిత్ర కార్పొరేషన్ చేపడుతోంది. కొన్ని నిర్మాణాలు పూర్తి చేసి తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించినా ప్రధానమైన రోడ్డు సౌకర్యం కల్పించలేదు. జాతీయ రహదారి నుంచి ఇళ్లు ఉన్న ప్రాంతానికి రావడానికే సరైన రహదారి లేదు. దీనికితోడు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో దరఖాస్తుదారులు స్వగృహపై ఆసక్తి చూపడం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 1300 మంది ధరావత్తు సొమ్ము వాపసు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నిర్మాణం పూర్తి అయిన ఇళ్లను వేలం వేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం వేలం నిర్వహించనుండటంతో ప్రభుత్వం మొదట ప్రకటించిన ధర కంటే సుమారు 30 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇంత ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

 బిల్లు.. ఇళ్ల కోసం.. ఎదురుచూపులు

 మరోపక్క ఇందిరమ్మ,ఆర్ పీహెచ్ వంటి ఇళ్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో రచ్చబండలో మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్ల బకాయిలు ఇప్పటికీ లబ్ధిదారులకు అందలేదు. అధికారంలోకి రాక ముందు లక్ష ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని చెప్పిన తెలుగుదేశం నేతలు అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. జిల్లాలో 19 వేల మంది లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తుండగా.. మరో 25 వేల మంది ఇళ్ల మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరా అవాస్ యోజన(ఐఏవై) ఇళ్లు మంజూరు చేసేవారు. అలాగే మురికివా డల వారికి వాల్మీకి అంబేద్కర్ అవాస యోజన(వాంబే) ఇళ్లు ఇచ్చే వారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక ఇవేవీ అమలు కావడంలేదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top