రాజంపేట ఎంపీపీపై అనర్హత వేటు

రాజంపేట ఎంపీపీపై అనర్హత వేటు - Sakshi


రాజంపేట: వైఎస్సార్‌సీపీ జారీ చేసిన విప్‌ను దిక్కరించి.. రాజంపేట ఎంపీపీగా ఎన్నికైన సుహర్లత పై అనర్హత వేటు పడింది. విప్ ధిక్కరించిన  ఎంపీపీపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతలు సంబంధిత  ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.  తాజాగా  రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సుహర్లతపై అనర్హత వేటు వేస్తూ ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవిషయాన్ని  ఎంపీడీఓ వెంకటసుబ్బయ్య ధ్రువీకరించారు. దీంతో ఎంపీటీసీ స్థానంతో పాటు ఎంపీపీ పదవి కూడా సుహర్లత కోల్పోయారు.

 

టీడీపీకి అభ్యర్థి లేకపోవడంతోనే..

రాజంపేట ఎంపీపీ పదవి ఎస్సీ వర్గానికి కేటాయించారు. ఉన్న ఎస్సీ ఎంపీటీసీల స్థానాల్లో ఒక్కటి కూడా టీడీపీ గెలుచుకోలేక పోయింది.  దీంతో వారు వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ఎస్సీ అభ్యర్థి సుహర్లతను ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకున్నారు. అధికారపార్టీ ఇచ్చిన ఆఫర్‌తో ఆమె  కూడా ఎంపీపీ పదవికి కోసం పార్టీని వదిలి టీడీపీకి మద్దతిచ్చారు. దీంతో ఇరు పార్టీలకు సమాన  ఓట్లు ఉండగా.. డిప్‌లో ఎంపీపీ పదవి టీడీపీ కి, వైస్ ఎంపీపీ వైఎస్సార్ సీపీకి దక్కింది. ప్రస్తుతం వైస్ ఎంపీ పీగా ఆకే పాటి రంగారెడ్డి ఉన్నారు.

 

ధర్మం గెలిచింది: ఎంపీపీ సుహర్లతపై అనర్హత వేటు పడటం వల్ల ధర్మం గెలిచినట్లయిందని వైఎస్సార్‌సీపీనేత ఆకేపాటి మురళీరెడ్డి అన్నారు.న్యాయం ఎప్పటికైనా నిలుస్తుందని, ఇది వైఎస్సార్‌సీపీ విజయమన్నారు.

 

అంతిమంగా న్యాయమే గెలుస్తుంది: ఆకేపాటి

రాజంపేట: ధర్మం... న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. రాజంపేట ఎంపీపీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆకేపాటి భవన్‌లో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా సరే గీత దాటితే గుణపాఠం తప్పదని, అందుకు నిదర్శనం రాజంపేట ఎంపీపీ పదవిని కోల్పోవడమేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీటీసీగా గెలిచిన సభ్యురాలును టీడీపీ ప్రలోభాలకు చూపి తమ వైపు తిప్పుకుని ఎంపీపీ పదవిని కేటాయించడం జరిగిందన్నారు.

 

అందువల్ల పార్టీ జారీ చేసిన  విప్ ఆధారంగా అనర్హత వేటు పడిందన్నారు. పార్టీలు మారే వారికి ఇది కనువిప్పు కలిగిస్తుందన్నారు. రాజంపేట మండల పరిషత్ ఎన్నికల్లో నైతికంగా ఏనాడో వైఎస్సార్ సీపీ గెలిచిందన్నారు. జిల్లాలో అనేక చోట్ల ఈ విధంగా అవకతవకలకు పాల్పడి పదవులు పొందిన వారికి ఎన్నికల సంఘం వేటుకు పదవులు కోల్పోవడం తప్పదన్నారు.  నిబంధనలు పాటించిన ఎన్నికల సంఘానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈయనతో పాటు మండల పార్టీ కన్వినర్ నాగినేని నాగేశ్వరనాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు నాగేశ్వరరెడ్డి, సుబ్బరాజు, సర్పంచ్ బుర్రు నాగేశ్వరరావు  పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top