రాబందులు


► అధికారపార్టీ నాయకుల సిఫారుసు ఉంటేనే రైతు బంధు

► లేకుంటే గిడ్డంగుల్లో ఖాళీ ఉండదు

► కాసులిస్తే ఓకే..రోజూ పదుల సంఖ్యలో 

► తిరిగి వెళుతున్న రైతులు

 

కొడవలూరు(కోవూరు): నాయుడుపాళేనికి చెందిన సతీష్‌రెడ్డి అనే రైతు తాను పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు బంధు కింద ధాన్యాన్ని గిడ్డంగుల్లో నిల్వ బెట్టుకోవాలనుకున్నాడు. నార్తురాజుపాళెంలోని కోవూరు మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఈ నెల మూడో తేదీన సంప్రదించారు. గిడ్డంగులు ఖాళీ లేవనడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లారు. రెండ్రోజుల తరువాత సిఫారుసుతో వచ్చిన ఓ రైతు ధాన్యం మాత్రం నిల్వబెట్టుకున్నాడు. ఇదీ మార్కెట్‌ కమిటీ అధికారుల తీరు. 

 

∙  రైతులకు కల్పతరువు లాంటి రైతు బంధు పథకాన్ని సంబంధిత అధికారులు రైతు రాబందు పథకంగా మార్చేశారు. మార్కెటింగ్‌ శాఖ అధికారుల వైఖరి కారణంగా సామాన్య రైతుకు ఆ పథకం అందడం లేదు. అధికార పార్టీ నాయకుల íసిఫారుసు ఉన్నా లేక కాసులు సమర్పించుకుంటేనే పథకాన్ని సద్విని యోగం చేసుకోగలుగుతున్నారు. లేకపోతే గిడ్డంగులు ఖాళీ లేవంటూ తిప్పి పంపేస్తున్నారు. ఈ సాకుతో రోజూ మార్కెటింగ్‌ శాఖ కార్యాలయానికి తిరిగిపోతున్న రైతుల సంఖ్య పదుల్లో ఉంటోంది. 

 

ఇదీ రైతుబంధు పథకం.. 

రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేనపుడు నష్టానికే తెగనమ్ముకోకుండా రైతు బంధు పథకం దోహదపడుతుంది. ధాన్యానికి ధర క్షీణించినప్పుడు రైతులు నష్టానికి అమ్ముకోకుండా రైతు బంధు పథకం కింద మార్కెటింగ్‌ శాఖ గిడ్డంగుల్లో భద్రపరచుకోవచ్చు. రైతులు భద్రపరచుకున్న ధాన్యానికి విలువ కట్టి అందులో 75 శాతాన్ని రైతులకు ఆర్నెల్లపాటు ఎలాంటి వడ్డీ లేకుండా ముందుగానే ఇచ్చేస్తారు. ఆ డబ్బుతో రైతుల తక్షణ అవసరాలు తీర్చుకుని ధాన్యానికి బాగా ధర వచ్చాక ధాన్యాన్ని అమ్ముకుని లాభపడవచ్చు. ధాన్యాన్ని అమ్ముకున్నప్పుడు మాత్రమే రైతు ఎలాంటి వడ్డీ లేకుండా మార్కెటింగ్‌ శాఖ నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్నెల్లలోనూ మంచి ధర రాకుంటే ఆ తరువాత నిల్వ పెట్టిన ధాన్యానికి రూపాయి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్నెల్లకంటే ఎక్కువగా నిల్వ పెట్టే పరిస్థితి ఉండదు గనుక రైతులు లాభపడతారు. 

 

ఖాళీల్లేవట 

ప్రస్తుతం తొలి పంట వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లోకి వస్తోంది. «ధాన్యం తెలంగాణకు వెళుతుంటే బాగా గిరాకీ ఉంటుంది. కేవలం చెన్నైకి మాత్రమే వెళుతుండడం, అక్కడ కూడా ఆశాజనకమైన ధర లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి కనబరచడం లేదు. రైతులు అమ్మకోలేక రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో ఆరబోసుకుంటున్నారు. బీపీటీ రకాన్నయినా కొందరు కొనుగోలు చేస్తుండగా, నెల్లూరు జిలకర రకాన్నయితే అడిగే వారు కరువయ్యారు. ధాన్యం నిల్వ బెట్టుకుందామని వెళుతున్న రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. గిడ్డంగులు ఖాళీలేవన్న సాకుచూపి తిప్పి పంపేస్తున్నారు. సిఫార్సుతో లేదా జేబులు తడిపినా ఖాళీ ఉంటోందన్న విమర్శలూ ఉన్నాయి. 

 

గిడ్డంగుల కొరత 

జిల్లాలో 1.85 లక్షల మెట్రిక్‌ టన్నుల గిడ్డంగులే ఉన్నాయి. కనీసం 5 లక్షల మెట్రిక్‌ టన్నుల గిడ్డంగులుంటే తప్ప జిల్లాలోని రైతుల అవసరాలు తీరవు. గిడ్డంగుల కొరత ఓ సమస్యయితే ఉన్న గిడ్డంగుల విషయంలో పక్షపాతం చోటుచేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

సద్వినియోగం చేసుకోలేకున్నాం 

మార్కెటింగ్‌ గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ బెడుదామని ఎప్పుడు వెళ్లినా గిడ్డంగులు ఖాళీలేవంటారు. కొందరు రైతులు ఆ తరువాత కూడా పెడుతూనే ఉన్నారు. ఇందులో మార్కెటింగ్‌ అధికారుల వైఖరేమిటో అర్థం కావడం లేదు. మాకు ఎలాంటి సిఫార్సు లేదనే అలా పంపుతున్నట్లున్నారు.   – కొనిజేటి శేషగిరిరావు, రైతు, నార్తురాజుపాళెం  

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top