రేషన్ డీలర్.. రైల్‌వేషం!

రేషన్ డీలర్.. రైల్‌వేషం! - Sakshi


నువ్వు డిగ్రీ పూర్తి చేశావా?.. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా?.. ఏం కష్టపడనక్కర్లేదు.. ఉద్యోగం నీ దగ్గరకే వస్తుంది. రైల్వే మంత్రి బంధువు నాకు బాగా తెలుసు. ఆరు లక్షల రూపాయలు నీవి కావనుకుంటే.. ఉద్యోగం నీ ఒళ్లో వాలుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. జీవితాంతం వేల రూపాయల జీతం.. ఆపైన దానికి మించిన ‘గీతం’.. నీ దశ తిరిగిపోతుందంటూ ఆశల ఆకాశంలో విహరింపజేశాడు. నమ్మించడానికి కాల్‌లెటర్లు, ప్రామిసరీ నోట్లు కూడా సృష్టించాడు. లక్షల్లో దండుకున్నాడు. ఆనక చుక్కలు చూపించాడు. రెండేళ్లు గడిచినా.. ఉద్యోగాలు లేవు.. ఇచ్చిన డబ్బుకు గ్యారెంటీ లేదు. మోసపోయామని గుర్తించిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇంత ఘరానా మోసానికి పాల్పడ్డ వ్యక్తి ఒక సాధారణ రేషన్ డీలర్ కావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు.ఎచ్చెర్ల: అతనో రేషన్ డీలరు..

 

 పేరు బాడాన సీతారాం.. స్వగ్రామం ఎచ్చెర్ల మం డలం కమ్మపేట. రైల్వే ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశాడని పలువురు ఇతనిపై మంగళవారం ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇతనో ఘరానా మోసగాడన్న విషయం వెలుగు చూసింది. ఇదే మండలానికి చెందిన సీపాన పోలినాయుడు, కొత్తకోట నర్సింహులు, వావిలపల్లి కొండ య్య, చిట్టి అసిరినాయుడు, హనుమంతు అసిరినాయుడు తదితరులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎచ్చెర్ల ఎస్సై ఉదయకుమార్ 420, 464, 472 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  వీరే కాకుండా ఇంకా చాలామంది రేషన్ డీలర్ చేతిలో మోసపోయారని తెలుస్తోంది. అతనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలుసుకున్న మిగిలిన బాధితులు కూడా బయటపడుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. మండలంలోని ఫరీదుపేట, ఇబ్రహింబాద్, పొన్నాడ, ధర్మవరం, వెంకన్నగారిపేట, చినరావుపల్లి తదితర గ్రామాలతోపాటు, శ్రీకాకుళం పట్టణంలోనూ ఇతని బాధితులు ఉన్నారని, ఉద్యోగాల పేరుతో వీరి నుంచి దండుకున్న మొత్తం రూ.కోటి వరకు ఉంటుందని సమాచారం.

 

 నాలుగేళ్లుగా ఇదే మోసం

 నాలుగేళ్ల నుంచీ సీతారాం మోసాల పరంపర కొనసాగుతోందని తెలిసింది. ఇతని మాయమాటలు నమ్మి గతంలో సర్పంచ్‌గా పని చేసిన వ్యక్తి కూడా తన కొడుక్కి ఉద్యోగం కోసం రూ.5 లక్షలు సమర్పించుకున్నారంటే.. నిందితుడు ఎంత మాయగాడో అర్థమవుతుంది. సదరు సర్పంచ్ నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా.. అతన్నే మధ్యవర్తిగా పెట్టి మరికొందరు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. డిగ్రీ, పీజీ విద్యార్థులను టార్గెట్‌గా చేసుకున్న సీతారాం వారిని నమ్మించడానికి అనేక జిమ్మిక్కులు, ట్రిక్కులు ప్రయోగించేవాడు. రైల్వేమంత్రి బంధువే తనకు బాగా తెలుసని నమ్మబలికేవాడు. రైల్వేలో గ్రూప్-సి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు. మరింతగా ఆకట్టుకోవడానికి నకిలీ కాల్‌లెటర్లు, మెడికల్ సర్టిఫికెట్లు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు సృష్టించి తనే వారి ఇళ్లకు పోస్టు చేసేవాడు. ఇంకొందరికీ వారిచ్చిన డబ్బుకు హామీగా 50 రూపాయల స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లపై తన ఆస్తులనే రాసిచ్చేశాడు.

 

 ఇలా రకరకాలుగా నమ్మించి.. స్థాయిని బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు దండుకున్నాడు. చివరికి తన బంధువులను సైతం విడిచిపెట్టలేదు. కాగా పలువురు నిరుద్యోగులను ఉద్యోగాలు వచ్చాయంటూ హౌరా, భువనేశ్వర్, ముంబై నగరాలకు తీసుకెళ్లాడు. అక్కడ వారిని లాడ్జీల్లో ఉంచి, రేషన్ సరుకులు వచ్చాయి, అర్జంటుగా విడిపించుకోవాలి.. తిరిగి వెంటనే వచ్చేస్తానని నమ్మించి వచ్చేశాడు. తర్వాత ఫోనులో సైతం అందుబాటులోకి రాకపోవడంతో వెళ్లినవారంతా ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వచ్చారు.

 

 ఎందుకలా చేశావని సీతారామ్‌ను నిలదీయగా రిక్రూట్‌మెంట్ రద్దయిందని, మళ్లీ ప్రయత్నిద్దామని సర్దిచెప్పేవాడు. అయి తే ఇటీవలి ఎన్నికల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, రైల్వే మంత్రి కూడా మారడంతో బాధితులు అతన్ని నిల దీయడం ప్రారంభించారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేయడంతో విశాఖలో ప్లాట్ల వ్యాపారం చేస్తున్నానని, డబ్బు అందగానే చెల్లించేస్తానని చెప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతని జాడ లేకపోగా.. ఫోనులోనూ సక్రమంగా అందుబాటులోకి రాకపోవడంతో చివరికి బాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలతో పోలీసులను ఆశ్రయించారు.

 

 ప్రామిసరీ నోట్ ఇచ్చాడు

 నా కుమారుడుకి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించారు. స్టాంప్ పేపర్‌పై ఆస్తి కూడా రాసిచ్చాడు. రెండేళ్ల నుంచి తిప్పుతున్నాడు. డబ్బులు ఇచ్చేయమంటే సమాధానం లేదు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను.

 -హనుమంతు దాలినాయుడు

 

 రైల్వే మంత్రి బంధువు తెలుసన్నాడు

 రైల్వే మంత్రి బంధువు తనకు తెలుసునన్నాడు. ఉద్యోగం గ్యా రెంటీ అన్నాడు. రెండేళ్ల నుంచీ అదే మాట. ఉద్యోగం లేదు.. డబ్బులూ తిరిగివ్వలేదుు. నిలదీస్తే సరైన సమాధానం లేదు.

 -చిట్టి అసిరినాయుడు, బాధితుడు.

 

 భూమి అమ్మి డబ్బు కట్టా

 భూమి అమ్మి డబ్బులు చెల్లించాను. రాతపరీక్ష కాల్‌లెటర్ కూడా ఇచ్చాడు. మీ కుమారుడికి ఉద్యోగం వచ్చేసినట్లేనని నమ్మించాడు. నిజమేననుకున్నాను. మోసపోయామని ఇప్పుడు అర్థమైంది.                      

 -సీపాన పోలినాయుడు

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top