మృత్యు మార్గాలు.. రైల్వే క్రాసింగ్‌లు

మృత్యు మార్గాలు.. రైల్వే క్రాసింగ్‌లు


మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో స్కూల్ బస్‌ను రైలు ఢీకొన్న ఘటనతో ‘పశ్చిమ’ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాపాలాదారు లేని రైల్వే క్రాసింగ్‌లు జిల్లాలోనూ అనేకం ఉన్నాయి. నిత్యం వందలాది వాహనాలు, ప్రయాణికులు వీటిని బిక్కుబిక్కుమంటూ దాటుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.   

 

 భీమవరం :జిల్లాలో కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌లు మృత్యుపాశాలుగా మారాయి. ఈ క్రాసింగ్‌ల వద్ద ఇప్పటి వరకు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయినా రైల్వే అధికారులు, ప్రభుత్వం గేట్లు ఏర్పాటు చేసేందుకు చొరవ చూపడం లేదు. గురువారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జరిగిన ఘటనతో కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌లు ఉన్న ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైల్వే శాఖ అనుమతితో గేట్లు ఏర్పాటు లేకపోయినా పక్కా రోడ్లు రైల్వే ట్రాక్‌ల మీదుగా నిర్మించడంతో నిత్యం వీటి గుండా వేలాది మంది ప్రయాణిస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. భీమవరం రైల్వే పోలీస్ సర్కిల్ పరిధిలో గేట్లు లేని రైల్వే క్రాసింగ్‌లు అధికంగా ఉన్నాయి.

 

 భీమవరం మండలం నర్సింహపురం సమీపంలో రైల్వేగేటు లేకపోయినా గ్రామం నుంచి పట్టణాన్ని కలుపుతూ  రైల్వేట్రాక్‌పై నుంచి పక్కా రోడ్డు ఏర్పాటు చేయడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక మట్టి ట్రాక్టరును రైలు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏడాదిన్నర క్రితం ఇదే రోడ్డులో రైలు వస్తున్నట్లు గుర్తించని ఒక మోటార్ సైక్లిస్ట్ పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. అదేవిధంగా ఉండి సమీపంలోని ఎఫ్‌సీఐ గోదాముల వెనుక గేటు లేని రోడ్డు మార్గం ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉండి మండలం వాండ్రం సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఉన్న రోడ్డుకు గేటు లేకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 

 అదేవిధంగా పాలకొల్లు, రూరల్ మండలంలో సగంచెరువు, మైదాడగుంట, జొన్నలగరువు వీరవాసరం మండలం నందమూరుగరువు, పాలకోడేరు మండలం వేండ్ర-కుముదవల్లి గ్రామాల మధ్యలో ఒక రోడ్డులో, అదేవిధంగా  గొరగనమూడి సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజ్‌కి వేళ్లే దారిలో రైల్వే గేటు లేకపోవడంతో కళాశాల యాజమాన్యమే ఒక ప్రైవేట్ గేట్ మెన్‌ను ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విధంగా నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రైల్వే ట్రాక్‌లు దాటుతున్నారు. ఈ క్రాసింగ్‌ల వద్ద రైల్వే గేటులను ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళనలు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top