ఎవరి కోసమీ బడ్జెట్


రైల్వే బడ్జెట్‌పై జిల్లాకు చెందిన వివివిధ పార్టీల నేతలు స్పందించారు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అధికార టీడీపీ, విపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. కొత్త రైల్వే జోన్ ప్రకటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరిద్దరు తప్ప టీడీపీ నేతలు సైతం బడ్జెట్ అసంతృప్తి కలిగించిందన్నారు.

 

 చంద్రబాబు బాటలో కేంద్రం

 రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ ఏర్పాటుకు 2001లోనే నిధులు మంజూరవగా ఇప్పటి వరకు దాని పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చంద్రబాబు మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా గాలిలో ప్రకటనలు గుప్పిస్తూ పరిపాలన సాగిస్తోంది.

 - గ్రంధి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, భీమవరం

 

 నిరాశపరిచింది

  కేంద్ర రైల్వే బడ్జెట్ తెలుగు రాష్ర్ట ప్రజలను నిరాశ పరిచింది. ఆంద్రప్రదేశ్‌కి ఎంతమాత్రం మేలు చేసేలా లేదు. గతానికి భిన్నంగా ఉంది. జిల్లాకు మొండిచెయ్యి చూపించారు. ఇది అన్యాయమైన బడ్జెట్.

 - తెల్లం బాలరాజు,

 అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్టీ సెల్, వైఎస్సార్ సీపీ

 

 భారం లేని బడ్జెట్

 ప్రయాణికులపై చార్జీల భారం మోపకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం హర్షణీయం. విశాఖను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించాలని కోరాం. దీనిపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో చర్చిస్తాం.

 - తోట సీతారామలక్ష్మి,

 రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ

 

 అసంతృప్తిగా ఉంది

 ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొవ్వూరు - భద్రాచలం రైల్వే పనులకు సంబంధించి ఈ బడ్జెట్ సమావేశంలోనైనా నిధులు కేటాయిస్తారని భావించాం. ఆ ప్రస్తావన రాకపోవడం బాధాకరం. భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైను పనులు జరిగితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

 - మొడియం శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, పోలవరం

 

 విఫలమైన ఎంపీలు

 కోటిపల్లి- నర్సాపురం, భద్రాచలం- కొవ్వూరు,  భీమవరం- గుడివాడ డబ్లింగ్ పనుల పూర్తిపై మన ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారు. జిల్లాలో పుష్కరాల సందర్భంగా యాత్రికులకు మెరుగైన రైల్వే సౌకర్యాల కల్పనకు ఇప్పటికైనా వారు నడుం బిగించాలి.

 - పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి,

 వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి

 

 పెండింగ్ ప్రాజెక్టుల్ని మరిచారు

 పెండింగ్ ప్రాజెక్టుల్ని మంజూరు చేస్తే బాగుండేది. రైల్వే స్టేషన్లలో ైవైఫై ఏర్పాటు, ఆధునికీకరణ, ప్రయాణికుల సెల్‌ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్, రైల్వే శాఖకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు, రైల్వే స్టేషన్ల పూర్తి పరిశుభ్రతకు ప్రత్యేక విభాగం అంశాలు అభినందనీయం.

 - చింతమనేని ప్రభాకర్,

 

 రాష్ట్ర ప్రభుత్వ విప్ జోన్ ప్రకటిస్తే బాగుండేది

  రైల్వే బడ్జెట్‌లో విశాఖ ప్రత్యేక జోన్ ప్రకటిస్తే బాగుండేది. విశాఖ రైల్వేస్టేషన్‌ను స్మార్ట్ స్టేషన్ చేయాలన్న ప్రతిపాదన హర్షణీయం. పశ్చిమలో డబ్లింగ్ లైన్ పూర్తిపై స్పష్టత లేదు. రైల్వే శాఖ చేపట్టిన పనుల్లో 70 శాతం మధ్యలోనే నిలిచిపోతున్నాయి.  

 - వేటుకూరి వెంకట శివరామరాజు, ఎమ్మెల్యే, ఉండి

 

 ప్రజల ఆకాంక్షలకు తగినట్టు లేదు

 ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు రైల్వే బడ్జెట్ కూడా తీవ్ర నిరాశ మిగిల్చింది. విభజన చట్టంలో పేర్కొన్నట్టు ప్రత్యేక రైల్వే జోన్ ఊసే లేకపోవడం బాధాకరం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రైల్వే బడ్జెట్ లేదు.

 - అంబికా కృష్ణ, రాష్ట్ర వాణిజ్య సెల్ అధ్యక్షుడు,  టీడీపీ

 

 కొత్త ప్రాజెక్టులేవి?

  ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే ప్రాజెక్టులు ప్రకటించకపోవడం దురదృష్టకరం. గత యూపీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధికంగా కాంగ్రెస్ ఎంపీలున్నా ప్రయోజనం చేకూరలేదు. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వంలోనూ అదే పునరావృతమైంది.

 - నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే, పాలకొల్లు

 

 దక్షిణాదికి ఎప్పుడూ వట్టి చెయ్యే

 విభజన నేపధ్యంలో ప్రత్యేక జోన్ వస్తోందని భావించాం. దానిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అత్యధిక ఆదాయం వచ్చే ప్రాంతాన్ని విస్మరించడం తగదు. ప్రతి బడ్జెట్‌లో దక్షిణాదికి పూర్తి అన్యాయం జరుగుతోంది.

 - కేఎస్ జవహర్, ఎమ్మెల్యే, కొవ్వూరుై

 

 ఏ రాష్ట్రానికీ కొత్త రైల్వే లైన్లు లేవు

 బడ్జెట్లో ప్రయాణికుల భద్రత, బయో టాయ్‌లైట్లు, అదనపు బోగీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఏ రాష్ట్రానికి కూడా కొత్త రైల్వే లైన్లను ప్రకటించ  లేదు. ప్రయాణికులకు సౌకర్యాల కల్పనకు 67 శాతం నిధులను కేటాయించారు.

 - గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే, ఉంగుటూరు

 

 అన్యాయం చేశారు

 కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైనుకు ఈ బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించకపోవడం భాధాకరం. కేవలం రూ.కోటి  ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. రాష్ట్రానికి  నిధులు రాబట్టుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది.

 - ఎండీ రఫీవుల్లాబేగ్, డీసీసీ అధ్యక్షుడు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top