తిరుమల కొండకు ఇనుప కంచె

తిరుమల కొండకు ఇనుప కంచె - Sakshi


పూర్తయిన ఔటర్ సెక్యూరిటీ కార్డన్ తొలిదశ పనులు

 

 సాక్షి, తిరుమల: తిరుమల భద్రత కోసం శేషాచలం అడవి నుంచి శ్రీవారి కొండకు వచ్చే మార్గాలను కలుపుతూ టీటీడీ ఇనుప కంచె నిర్మించింది. ఔటర్ సెక్యూరిటీ కార్డన్ (ఇనుప కంచెతో రక్షణ గోడలా ఏర్పాటు)లో భాగంగా ఇనుప కంచె నిర్మాణం చేపట్టింది. తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని దశాబ్ద కాలం ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వర్గాల హెచ్చరికలున్నాయి. ఆ మేరకు భద్రతాపరమైన సిఫారసుతో ఆలయం చుట్టూ ఉండే అటవీప్రాంతాలను కలుపుతూ ఇనుప కంచె నిర్మించాలని నిర్ణయించింది. టీటీడీ  ధర్మకర్తల మండలి కూడా మూడేళ్ల క్రితం ఆమోద ముద్రవేసింది.



ఇందులో భాగంగా మొత్తం 12 కిలోమీటర్ల మేర ఇనుప కంచె నిర్మాణం పనులు 2014లో పారంభమయ్యాయి. తొలిదశ పనుల్లో భాగంగా టీటీడీ అధికారులు తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో 57 మలుపు వద్ద నుంచి ఉత్తర దిశలోని గోగర్భం డ్యాం వరకు మొత్తం 4.8 కిలోమీటర్ల మేర ఇనుప కంచె నిర్మాణం పనులు మొదలుపెట్టారు. ఆ మేరకు తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ దిగువ భాగం వరకు పనులు పూర్తయ్యాయి. 2.8 కిలోమీటర్ల మేర రెండో దశ ఇనుపకంచె నిర్మాణానికి టీటీడీ ధర్మకర్తల మండలి అంగీకారం తెలిపింది. ఆ మేరకు తిరుమలలోని పాచికాల్వ గంగమ్మగుడి మీదుగా గోగర్భం డ్యాం ఎగువన ఉండే రోడ్డుమార్గం వరకు కంచె నిర్మించనున్నారు.



 కంచెవల్ల ఉపయోగాలు...

► తిరుమల చుట్టూ పటిష్టమైన  ఇనుప కంచె నిర్మాణం పూర్తయితే చెక్‌పోస్టులనుంచి మినహా లోనికి వచ్చే అవకాశాలు తక్కువ.

► పూర్తిస్థాయిలో కంచె నిర్మిస్తే క్రూరమృగాల బారినుంచి భక్తులకు రక్షణ కల్పించే అవకాశం ఉంది.

► శ్రీగంధం, ఎర్రచందనం, ఇతర ఔషధాల మొక్కల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చు.

► కంచెకు సీసీ కెమెరాలు అమర్చితే అన్ని విధాలుగా భద్రతను పర్యవేక్షించే వ్యవస్థ పెరుగుతుంది.

► ఇనుప కంచె నిర్మాణం అనంతరం కంచె వెంబడి వాహన పెట్రోలింగ్ ట్రాక్ కూడా నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. వాహన పెట్రోలింగ్‌తో మరింత భద్రత పెరుగుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top