బలికోరుతున్న వికృతక్రీడ

బలికోరుతున్న వికృతక్రీడ


నెల్లూరు (టౌన్) : నాగార్జున యూనివర్సిటీలో ఘటన మరువక ముందే నెల్లూరులో ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలయ్యాడు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలలు గన్న విద్యార్థులు ర్యాగింగ్ భూతంలో చిక్కుకుంటున్నారు. తాజాగా నెల్లూరులోని పిడతపోలూరు శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఏఎన్‌యూలో ఆర్కిటెక్ విద్యార్థిని రుషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ప్రభుత్వం చర్యలు నామమాత్రంగా ఉండటంతో ర్యాగింగ్‌కు అడ్డుకట్ట పడటం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి చేరుతుంటారు.



కళాశాలల్లో ఆధిపత్యం సాధించేందుకు కొంతమంది వింత పోకడలకు పాల్పడుతుంటారు. వారిని మొదటలోనే కళాశాలల యాజమాన్యం అడ్డుకట్ట వేస్తే అనర్థాలు జరిగే అవకాశం ఉండదు. కళాశాలల్లో సీనియర్లు జూనియర్లను స్నేహపూర్వకంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ర్యాగింగ్ పేరుతో వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ప్రధానంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు వివిధ ప్రైవేటు కళాశాలల్లో ర్యాగింగ్ కనబడుతుంది. ర్యాగింగ్ విషయాన్ని పోలీసులకు తెలియనీయకపోవడంతో కొంతమంది ఆగడాలు మితిమీరుతున్నాయి. గతంలో ర్యాగింగ్ మీదు కేసులు నమోదైన చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. దీంతో ర్యాగింగ్‌కు విచ్చలవిడిగా పాల్పడుతున్నారు. కొన్ని సమయాల్లో యాజమాన్యాలు జోక్యం చేసుకుని సర్ధిచెప్పడంతో ర్యాగింగ్ వ్యవహారం బయటకు రావడంలేదు. కొత్త విద్యార్థులు స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.



 చట్టంలో ఏముంది....

►1997లో ర్యాగింగ్ చట్టం అమలులోకి వచ్చింది. యాంటీ ర్యాగింగ్ సెక్షన్-4 ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడ్డా, ప్రోత్సహించినా 6నెలలు జైలు, 1,000లు జరిమానా విధిస్తారు.

►ర్యాగింగ్ సమయంలో భయబ్రాంతులకు గురిచేస్తే ఏడాది జైలు, రూ.2 వేలు జరిమానా.

►ర్యాగింగ్ సమయంలో తీవ్రంగా గాయపరిచినా, అత్యాచారానికి పాల్పడినా ఐదేళ్లు జైలుశిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తారు.

►ర్యాగింగ్ సమయంలో మరణించినా, ఆత్యహత్య చేసుకునేలా ప్రేరిపించినా జీవిత శిక్ష, రూ.50వేలు జరిమానా ఉంటుంది.

►కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోకపోయినా, కాలయాపన చేసినా నేరతీవ్రతను బట్టి శిక్షను అమలు చేస్తారు.

►ర్యాగింగ్ సందర్భాల్లో ఎవరికైనా శిక్షపడ్డ వారిని కళాశాలల్లో చేర్చుకోవడం నేరంగా పరిగణిస్తారు.



 ర్యాగింగ్‌పై అందని ఫిర్యాదులు

 కళాశాలల్లో ర్యాగింగ్‌లకు పాల్పడ్డా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదులు అందడం లేదు. కళాశాలల్లోనే విద్యార్థులను సమావేశపరిచి యాజమాన్యాలు సర్ధిచెబుతున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న కొంతమంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు నెలల పాటు కళాశాలలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ర్యాగింగ్ సమస్యను ఎదుర్కొన్నా బయటకు చెప్పలేని విచిత్ర పరిస్థితి కొన్ని కళాశాలల్లో నెలకొంది. యాజమాన్యాలు మాత్రం ఫీజులపై పెట్టిన దృష్టి విద్యార్థుల ప్రవర్తనలపై పెట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తొలుత ఫిర్యాదందినప్పుడే చర్యలు తీసుకుంటే మున్ముందు ఎలాంటి సంఘటనలు జరగవంటున్నారు. ఇప్పటికైనా ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులకు కళాశాలల ప్రవేశాలను బహిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

 

 విద్యాసంస్థలు ప్రోత్సహించకూడదు -మురుగయ్య, వీఎస్‌యూ ప్రిన్సిపాల్

 కళాశాలల్లో సీనియర్లు, జూనియర్లు అంటూ వ్యత్యాసం ప్రదర్శిస్తున్నారు. ర్యాగింగ్‌ల పేరుతో ప్రాణాలు మీదకు తెస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి టీసీలు ఇచ్చి పంపించాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 ర్యాంగింగ్ నిషేధం బోర్డులను ఏర్పాటు చేయాలి -శివకుమార్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల

 ప్రధానంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ర్యాగింగ్ నిషేధం అని బోర్డులను ఏర్పాటు చేయాలి. ర్యాంగింగ్‌కు పాల్పడితే అమలయ్యే చట్టాలపై అవగాహన కల్పించాలి. ర్యాగింగ్‌లో ఒకరిపై అపవాదు మోపినా తీవ్ర  నేరం.

 అవగాహన కల్పిస్తున్నాం -తిరుమలనాయుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు

 ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షలు ఏవిధంగా అమలువుతయో తెలియజేస్తాం. ర్యాగింగ్‌కు పాల్పడితే విద్యార్థులు జీవితాలు నాశనమవుతాయి.

 కఠిన చర్యలు తీసుకోవాలి - శ్రవణ్‌కుమార్, వైసీపి విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు

 ర్యాగింగ్‌కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కళాశాలలపై కూడా చర్యలు తీసుకోవాలి. కళాశాలల్లో ర్యాంగింగ్‌పై అవగాహన కల్పించాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top