చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు


ప్రముఖ రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. ఆయన రాసిన 'మన నవలలు - మన కథనాలు' అనే పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. 2014 సంవత్సరానికి గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.



ప్రముఖ రచయిత, విమర్శకుడిగా రాచపాళెం సాహితీ వర్గాల్లో సుపరిచితులు. రాయలసీమ సాహితీ ఉద్యమం, దళిత జీవనం, ఆంధ్రకవిత్వం, గురజాడ కథానికలు.. ఇలా పలు అద్భుత రచనలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైనందుకు తనకు సంతోషంగా ఉందని చంద్రశేఖరరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.


ఆయన ప్రస్తుతం కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. తాను రాసిన విమర్శనాత్మక పుస్తకానికి అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. అందులో నవలలు, కథానికలపై 24 వ్యాసాలున్నాయని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా సాహిత్యంలో ఉన్న ఆయన 19 పుస్తకాలు ప్రచురించారు. ఇప్పుడు అవార్డు వచ్చిన మన నవలలు- మన కథలు పుస్తకాన్ని 2010లో రాశారు. 11 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. తెలుగులో సాహితీ విమర్శ సరిగా ఎదగలేదన్న విమర్శలకు ఈ అవార్డే సమాధానమని ఆయన చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top